Woman Beard: గిన్నిస్ వరల్డ్ రికార్డులు చాలా వింతగా, విచిత్రంగా ఉంటాయి. కనీసం మన ఊహకు కూడా అందని అంశాల్లో ప్రతిభ కనబరిచి ప్రపంచస్థాయిలో ప్రాముఖ్యత సంపాందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో వింతైన విషయంలో ఓ వ్యక్తి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. ఆ వ్యక్తికి వచ్చిన రికార్డు ఏంటి అనేదేగా మీ డౌట్.. అత్యంత పొడవైన గడ్డం కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. మరి ఆ వ్యక్తి గడ్డం ఎన్ని మీటర్ల పొడవు ఉందో తెలుసా.. 11.8 అంగుళాలు. ఆ మాత్రం గడ్డానికే గిన్నిస్ రికార్డు ఇచ్చారా.. చాలా మందికి ఉంటుంది కదా.. కొన్ని నెలల పాటు గడ్డం షేవ్ చేసుకోకపోతే మాక్కూడా పెరుగుతుంది అనుకుంటున్నారా? అవును పురుషులు కొన్ని నెలల పాటు షేవ్ చేసుకోకపోతే ఈజీగానే 11.8 అంగుళాల గడ్డాన్ని పెంచగలరు. అయితే తాజాగా గిన్నిస్ రికార్డు పొందిన వ్యక్తి పురుషుడు కాదు స్త్రీ. స్త్రీలకు గడ్డం ఉండదు. చాలా అరుదుగా కొంత మందిలో చిన్న చిన్న వెంట్రుకలు పై పెదాలపై, గడ్డం రూపంలో కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా 11.8 అంగుళాల మేర గడ్డం పెరగడంతో అది గిన్నిస్ రికార్డు సాధించింది. 


అమెరికాకు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హనీకట్ అరుదైన ఈ రికార్డు అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ లో స్థానం అందుకున్నారు. ఆమెకు 11.8 ఇంచ్ ల పొడవైన గడ్డం ఉన్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు. గతంలో 10.04 అంగుళాల పొడవుతో అదే దేశానికి చెందిన వివాన్ వీలర్ అనే మహిళ పేరిట ఉన్న రికార్డును తాజాగా ఎరిన్ హనీకట్ అధిగమించారు. మిషిగాన్ కు చెందిన హనీకట్ కు బాల్యం నుంచి జన్యుపరమైన సమస్యలు ఉండేవి. 13 సంవత్సరాలు వచ్చే నాటికి ఆమెకు గడ్డం పెరగడం మొదలైంది. మగవారిలా గడ్డం పెరుగుతుండటం పట్ల హనీకట్ తీవ్రంగా ఆందోళన చెందింది. రోజుకు మూడు నాలుగు సార్లు షేవింగ్ చేసుకునేదాన్ని అని ఎరిన్ హనీకట్ తెలిపారు. అవాంఛిత రోమాలను తొలగించేందుకు రకరకాల క్రీములు, జెల్ లు వాడారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 


Also Read: PM Modi: బెంగాల్ పంచాయతీ ఎన్నికలపై మోదీ మండిపాటు, రక్తంతో ఆడుకున్నారంటూ మమత సర్కారుపై ధ్వజం


కొన్నాళ్ల తర్వాత విపరీతమైన రక్తపోటుతో కంటి స్ట్రోక్ వచ్చింది. దీని వల్ల పాక్షికంగా దృష్టిని కూడా కోల్పోయారు. అప్పటి నుంచి రోజూ షేవ్ చేసుకోవడం మానేశారు. అలాగే రకరకాల క్రీములు వాడటం కూడా ఆపేశారు. దీంతో గడ్డం క్రమంగా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. దీంతో ఎరిన్ హానికట్ తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు రాలేకపోయారు. చాలా కాలం పాటు కొన్నాళ్లపాటు నరకం అనుభవించారు. ఆమె రోజురోజుకూ కుంగిపోయారు. ఆమె మానసిక పరిస్థితి మరింత క్షీణించుకుపోవడంతో.. ఆమె స్నేహితులు, బంధువులు గడ్డం ఉంటే తప్పేంటని అన్నారు. ఇలా ఇంకా అందంగా ఉన్నావంటూ ప్రోత్సహించే వారు. క్రమంగా ఆందోళన విడిచిపెట్టారు ఎరిన్ హనీకట్. గడ్డం పెంచడంపైనే దృష్టి పెట్టారు. అలా తన గడ్డం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించారు.