PM Modi: పశ్చిమ బెంగాల్ లో జరిగిన పంచాయతీ ఎన్నికలపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై శనివారం (ఆగస్టు 12) నాడు విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ లోని క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని మోదీ.. టీఎంసీ నే ఖూనీ ఖేల్ ఖేలా హై అని హిందీలో అన్నారు. అంటే పంచాయతీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో ఆడుకుంది అని విమర్శించారు. అంతే కాకుండా.. టీఎంసీ ఓటర్లను కూడా బెదిరిస్తోందని, వారి జీవితాలను నరకం చేస్తోందని ప్రధాని ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి తమను తాము ఛాంపియన్లుగా చెప్పుకునే వారు ఈవీఎం మిషన్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. 


టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు


టీఎంసీ పార్టీ బీజేపీ కార్యకర్తలను మాత్రమే కాకుండా ఓటర్లను కూడా బెదిరిస్తోందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్ వేయకుండా ఉండేందుకు టీఎంసీ పార్టీ నాయకులు ఏమైనా చేస్తారని ఆరోపించారు. బూత్ లను స్వాధీనం చేసుకునేందుకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. ఇది రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న వారి తీరు అంటూ మండిపడ్డారు. పార్టీ పనిని పూర్తి చేయడానికి ప్రాణాంతక దాడులను తన సాధనంగా ఉపయోగిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై మోదీ విరుచుకుపడ్డారు. 


Also Read: Rare Animals: జూలో రేర్ యానిమల్స్! మంచు చిరుత, రెడ్ పాండా పిల్లల్ని ఎప్పుడైనా చూశారా? ఇవిగో


పంచాయతీ ఎన్నికల్లో కొనసాగిన దీదీ హవా


పశ్చిమ బెంగాల్ లోని 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు జులై 8వ తేదీన ఎన్నికలు జరిగాయి. జులై 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భారీ విజయం సాధించింది. మొత్తం 63,229 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 35వేలకు పైగా స్థానాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ దాదాపు 10 వేల స్థానాల్లో గెలుపొందింది. లెఫ్ట్ - కాంగ్రెస్ కూటమికి 6 వేలకు పైగా పంచాయతీ స్థానాలు దక్కాయి. 928 జిల్లా పరిషత్ సీట్లలో 880 సీట్లను టీఎంసీ కైవసం చేసుకుంది. బీజేపీ 31 సీట్లు సాధించింది. లెఫ్ట్ - కాంగ్రెస్ కూటమి 15 సీట్లు గెలుచుకున్నాయి. మిగిలిన 2 సీట్లను స్వతంత్ర్య అభ్యర్థులు గెలుచుకున్నారు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు నెలలో ఎన్నికల సంబంధిత హింసలో 40 మందికిపైగా మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. ఒక్క ఎన్నికల పోలింగ్ రోజునే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో బ్యాలెట్లను లూటీ చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ప్రయత్నించినట్లు బీజేపీ ఆరోపించింది. బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా టీఎంసీ శ్రేణులు అడ్డుకున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ చేసిన ఈ ఆరోపణలను సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ వేదికగా ఖండించారు. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ప్రభుత్వాన్ని కించపరిచేలా నిరాధారమైన ఆరోపణలు, దురుద్దేశపూరిత ప్రచారం కూడా ఓటర్లను మధ్యపెట్టలేక పోయిందని పేర్కొన్నారు.