Bank Robbery: 



సూరత్‌లో ఘటన..


గుజరాత్‌లోని సూరత్‌లో భారీ బ్యాంక్ దోపిడీ జరిగింది. సినిమా ఫక్కీలో ఐదుగురు దొంగలు వచ్చి తుపాకీలతో బెదిరించి రూ.14 లక్షలతో ఉడాయించారు. బ్యాంక్‌లోని సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పగలే ఈ స్థాయిలో చోరీ జరగడం కలకలం రేపింది. హెల్మెట్‌లు పెట్టుకుని బైక్‌పై వచ్చిన దొంగలు...బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోకి చొరబడ్డారు. ఆగస్టు 11న ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఆయుధాలతో వచ్చిన వాళ్లు డబ్బు తీసుకుని పారిపోయారు. రెండు బైక్‌లపై వచ్చిన దొంగలు బ్యాంక్‌లోకి ఎంటర్ అయ్యారు. వెంటనే తుపాకులు బయటకు తీశారు. అప్పటికే సిబ్బంది అప్రమత్తమైనా...లాభం లేకుండా పోయింది. కస్టమర్స్‌ వీళ్లను చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వాళ్లకీ తుపాకులు గురి పెట్టారు దుండగులు. కౌంటర్‌లో నుంచి డబ్బు తీసి బ్యాగ్‌లో వేయాలని బెదిరించారు. ఎవరూ ఎవరికీ ఫోన్‌లు చేయకుండా కట్టడి చేశారు. వీళ్ల బెదిరింపులతో భయపడిపోయి సిబ్బంది, కస్టమర్స్ వెంటనే ఓ రూమ్‌లోకి వెళ్లిపోయారు. ఓ దొంగ వచ్చి కౌంటర్‌లలో డబ్బు కోసం వెతికాడు. మరో వ్యక్తి వచ్చి డబ్బు తీసి బ్యాగ్‌లలో సర్దేశాడు. బ్యాగ్ నిండే వరకూ డబ్బు పెట్టి ఆ తరవాత అక్కడి నుంచి పారిపోయారు. అప్పటి వరకూ స్టాఫ్‌తో పాటు కస్టమర్స్‌ అదే రూమ్‌లో బందీలుగా ఉండిపోయారు. రూ.14 లక్షలతో వాళ్లు పారిపోయిన తరవాత వీళ్లంతా బయటకు వచ్చారు. అంతా ఐదు నిముషాల్లోనే జరిగిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. సిటీ మొత్తం జల్లెడ పడుతున్నారు. రెడ్ అలెర్ట్ ప్రకటించారు. చెక్‌పాయింట్స్ వద్ద తనిఖీలు చేపడుతున్నారు. రోడ్‌లను బ్లాక్ చేశారు. అన్ని చోట్లా సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. స్పెషల్ టీమ్‌తో గాలిస్తున్నారు.