Uttarakhand Rains: 


ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు 


ఉత్తరాఖండ్‌లోని భారీ వర్షాలకు కేదార్‌నాథ్ యాత్రకు ఆటంకాలు తప్పడం లేదు. రుద్రప్రయాగ్ జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఘోర విషాదం చోటు చేసుకుంది. కార్‌లో వెళ్తున్న వారిపై కొండ చరియలు విరిగి పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు గుజరాత్‌కి చెందిన వాళ్లున్నారని పోలీసులు వెల్లడించారు. కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. అందరి మృతదేహాలను రికవరీ చేసినట్టు చెప్పారు. నలుగురిని గుర్తించినప్పటికీ ఐదో వ్యక్తి గురించి వివరాలు తెలియడం లేదని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. కేదార్‌నాథ్‌ హైవేపై కొండచరియలు విరిగి పడడం వల్ల రాకపోకలు స్తంభించాయి. దారి పూర్తిగా  ధ్వంసమైంది. ఈ క్రమంలోనే కార్‌ ఆ శిథిలాల్లో చిక్కుకుంది. వారిని బయటకు తీసేందుకు చాలా సమయం పట్టినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కోట్‌ద్వార్‌లో పరిస్థితులు సమీక్షించారు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ కొండ చరియలు విరిగి పడడం వల్ల ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే పలు వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల రాకపోకలు ఆగిపోయాయి. పలు బ్రిడ్జ్‌లను రిపేర్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు. త్వరలోనే పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.