Supreme Court vs Central Govt :    మోదీ ప్రభుత్వం మరో బిల్లును పార్లమెంట్ ముంగిటకు తెచ్చింది. వ్యవస్థలను వ్యవస్థీకృతంగా అదుపులోకి తీసుకుంటోందన్నది ఈ ప్రభుత్వంపై ఉన్న అపప్రథ.దానిని మరింత ధృఢపరిచేలా ఓ కీలక బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రం.  ప్రధాన ఎన్నికల కమిషనర్ సహా ఈసీల నియామకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై తీసుకొచ్చిన ఈ బిల్లు.. సీఈసీ నియామకంపై సుప్రీం కోర్టు నిర్దేశానికి తూట్లు పొడిచేలా ఉంది. 


ఈసీ నియామకంలో సీజేఐ ప్రమేయం లేకుండా చట్టం 


రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దూకుడైన నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం అదే కోవలో ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన Chief Election Commissioner and other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Bill, 2023 పెద్ద దుమారాన్నే రేపింది. కొత్త బిల్లు  ఎన్నికల కమిషన్‌ నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర లేకుండా చేసింది. సీఈసీ ఎంపిక ప్రక్రియలో భారత ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేస్తోంది.   అయితే ఇప్పటి వరకూ ఈ విషయంలో న్యాయవ్యవస్థ పాత్ర ఉందని కాదు కానీ... జనరల్ ఎలక్షన్ ను నిర్వహించే ఎన్నికల సంఘం నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉండాలన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలకు ఇది పూర్తి విరుద్ధం. 


విపక్షాల తీవ్ర నిరసనల మధ్య కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జన్ సింగ్ మేఘవాల్ రాజ్యసభలో బిల్లు పెట్టారు.  చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఈసీలతో కూడిన కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వానికి  గుత్తాధిపత్యం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు.  దీని ప్రకారం సీఈసీ, ఇతర ఎలక్షన్ కమిషనర్‌లను ముగ్గురు సభ్యుల ప్యానల్ ఎంపిక చేస్తుంది. ఇందులో ప్రధానమంత్రి,  లోక్ సభ లో ప్రతిపక్షనేత, ప్రధాని నామినేట్ చేసిన ఓ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఒక వేళ ప్రతిపక్ష నేత హోదా ఎవరూ పొందకపోతే.. ప్రతిపక్షంలోని అతిపెద్ద పార్టీకి చెందిన ఫ్లోర్‌ లీడర్ సభ్యుడిగా ఉంటారు.  అసలు ఈ నియామక ప్రక్రియపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుపై ఎందుకు వ్యతిరేకత వస్తోందని మట్లాడుకునే ముందు అసలు ఈ పరిస్థితి ఇక్కడి దాకా ఎలా వచ్చిందని చూద్దాం. 


ఎలక్షన్ కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఉండాలన్న సుప్రీంకోర్టు


దేశంలో 1952నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో సాధారణ ఎన్నికలు , రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారమే ఈ ఎన్నికల ప్రక్రియ. అయితే  ఈ ఎన్నికలను నిర్వహించే ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు మాత్రం  ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఆర్టికల్ 342 ప్రకారం,  ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి సిఫారసుపై ...రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్ లో ని సీఈసీని, ఇతర ఎలక్షన్ కమిషనర్లను నియమిస్తారు. ప్రజాస్వామ్య సౌధానికి మూలమైన ఈ ఎలక్షన్ కమిషన్ అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వ సిఫారసుతో ఏర్పాటవుతోంది. దాదాపు 70ఏళ్లుగా ఇదే నడుస్తోంది.  ఈ ప్రక్రియను తప్పు పడుతూ.. దేశంలోని ప్రజాస్వామ్య వాదులు  2015నుంచి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. వీటిపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ఎలక్షన్ కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉండాలని పేర్కొంది. 


జస్టిస్ కె.ఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది.  "అధికార పగ్గాలు అందిపుచ్చుకున్న రాజకీయ వ్యవస్థ.. ఎన్నికల కమిషన్ ఏర్పాటుపై ఎలాంటి చట్టం  చేయకుండానే ఏడు దశాబ్దాలు గడచిపోయాయి. ఇప్పటికైనా ఇది మారాలి. దీనిపై ఓ చట్టం రావాలి. అయితే అది ఇప్పుడున్న నామ్ కే వాస్తే.. నియామకంలా.. కార్యనిర్వాహణ వ్యవస్థకే మొత్తం అధికారం కట్టబెట్టేలా ఉంటే ఉపయోగం లేదు ‘” అని స్పష్టం చెప్పింది. కీలకమైన ఎన్నికల ప్రక్రియలో న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం తప్పని సరి అని చెబుతూ... ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను భాగస్వామ్యం చేయాలని విస్పష్టంగా చెప్పింది. త్వరగా దీనిపై చట్టాన్ని చేయాలని ఆ లోగా సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముక్తకంఠంతో చెప్పింది. 


ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో చీఫ్ జస్టిస్ పాత్ర ఉండాలి అని చెప్పడం.. కేవలం న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం  ఉండాలి అనుకోవడం ఒకటే కాదు, అత్యంత ముఖ్యమైన ఎన్నికల ప్రక్రియలో కార్యనిర్వాహక వ్యవస్థ ఎక్కువ జోక్యాన్ని కలిగి ఉండటాన్ని నియంత్రించడం కూడా... ! రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలంటే.. మూడు వ్యవస్థలకూ ప్రాధాన్యం ఉండాలి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఈ కౌంటర్ బ్యాలెన్స్ తప్పనిసరి. న్యాయవ్యవస్థ ఇందులో చేర్చడం ద్వారా ఏ ఒక్క సిస్టమ్ ..పూర్తి నియంత్రణ లేకుండా  అడ్డుకున్నట్లు ఉంటుంది. అది రాజ్యాగం మౌలిక స్ఫూర్తికి సంకేతం. 


సీఈసీని ప్రధానే నియమించుకునే పరిస్థితి ! 


ప్రస్తుత నియామక ప్రక్రియను సమర్థించేలా కొత్త చట్టం ఉండొద్దన్నది సుప్రీంకోర్టు ఆదేశం. కానీ దానిని కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం CEC నియామకాన్ని ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసు చేస్తోంది. అంటే ప్రధానిదే నిర్ణయం అనుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన బిల్లులో ప్రధానితో పాటు.. ప్రతిపక్షనేత, మరో కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ప్రధాని నియమించిన కేబినెట్ మంత్రి అంటే కచ్చితంగా ఆయన ప్రధాని చెప్పినట్లు వినాల్సిందే. ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ఓ వ్యక్తిని సమర్థిస్తే. .ఇక ప్రతిపక్ష నేత చెప్పిన దానికి విలువేం ఉంటుంది...? ఇది ఎలా ఉందంటే.. ప్రస్తుతం అమలవుతున్న నామినేషన్ విధానానికే చట్ట రూపం కల్పించినట్లు అయింది. సుప్రీం కోర్టు తీర్పు స్పూర్తి ఇంకెక్కడుంది..? 


రాజకీయ పార్టీల భవితవ్యం, ఆ మాటకొస్తే.. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ భవితవ్యమే ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది. రాజ్యాంగ వ్యవస్థలో అలాంటి కీలకమైన విభాగం ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే సుప్రీంకోర్టు ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం కూడా ఉండాలని కోరుకుంది. ECI నియామకం పారదర్శకంగా ఉండాలంటే.. ఇది తప్పనిసరి అని చెప్పింది. రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలన్నా కూడా  న్యాయ  వ్యవస్థ జోక్యం ఉండాలని సుప్రీంకోర్టు భావించింది. కానీ మోదీ ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకోలేదు.


సుప్రీం చెప్పినట్లుగా చేస్తే... ఒకవేళ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకే అభిప్రాయం కలిగి ఉంటే.. ప్రభుత్వం ఏం చేయలేదు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని శాసించగలిగేటువంటి.. ఎలక్షన్ కమిషన్ నియామకంలో ఎగ్జిక్యూటివ్ మాట చెల్లుబాటు కాకపోతే.. ప్రభుత్వం ఎందుకు  అని మోదీ భావించినట్లు ఉంది. అందుకే ఆయన చట్టాన్ని చేసినట్లు చేశారు. కానీ దానిని ప్రభుత్వానికి తగినట్లుగా చేసుకున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ బిల్లు తీసుకురావడంలో ఆంతర్యం ఏంటన్నది తేలకుండా ఉంది. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకాలం వచ్చే ఎన్నికల తర్వాతనే పూర్తవుతుంది. అయితే ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అనూప్ చంద్ర పాండే పదవీకాలం ఎన్నికలకు ముందు ఫిభ్రవరిలో పూర్తవుతుంది. అప్పుడు కొత్త ఎలక్షన్ కమిషనర్ ను ఎన్నుకోవలసి ఉంటుంది. అయితే ఎన్నికలకు ముందు ఇంకో ఈసీని నియమిస్తారా అన్నది సందేహమే. 


ముందు ముందు ఏం జరుగుతుంది ? 


ఆర్టికల్ 370 రద్దు మొదలుకుని.. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రపోజల్  వరకూ కచ్చితమైన అజెండాతోనే చట్టాలను చేస్తున్న మోదీ ప్రభుత్వం ఈ విషయంలోనూ అదే దారిని అవలంభించింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. వారి నిరసనల మధ్యనే బిల్లుపై ఎలాంటి చర్చ జరగకుండా వాయిదా వేశారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునేలా మోదీ ప్రభుత్వం ఈసీఐ స్వతంత్రను హరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ECI కీలుబొమ్మగా మార్చే పన్నాగమని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. మిగతా రాజకీయ పక్షాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ చర్చ ఇంతటితోనే ఆగేలా లేదు. ఎన్నికల వ్యవస్థలో న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం అవసరం అని ఎలా సుప్రీంకోర్టు భావిస్తుందో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంలో కూడా కార్యనిర్వాహక వ్యవస్థ భాగస్వామ్యం ఉండాలని ఎగ్జిక్యూటివ్ వాదించే అవకాశం ఉంటుంది. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా జాతీయ జ్యుడిషియల్ నియామక చట్టం తేవాలి అని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సుప్రీంకోర్టు అభ్యంతరం చెబుతోంది.  చూడాలి ఏం జరుగుతుందో..!