Women Reservation Bill:
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలిరోజే మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం ప్రస్తావనకు వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది ఈ బిల్లు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకావానికి ముందు రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష కూటమికి చెందిన పార్టీల నుంచి ఈ బిల్లుకు మద్దతు లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును... ఐదు రోజుల ప్రత్యేక సెషన్‌లో ప్రభుత్వ అజెండా జాబితాలో చేర్చనప్పటికీ... తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది. అది ఇప్పటికీ లాప్ కాలేదు. దీంతో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడమే మిగిలింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..
కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 6:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాగా, రెండు గంటలకు పైగా సాగింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చట్టసభల్లో (పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు) మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. రేపు (సెప్టెంబరు 19) కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం కాబోయే సమావేశాల్లో తొలి బిల్లుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లునే ప్రవేశపెట్టనున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి?
దేశంలో లింగ విబేధం లేకుండా అందరికి సమాన హక్కులు కలిగి ఉండాలని.. అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆంక్షతో స్వాతంత్ర్యం సాధించుకున్నాం. కానీ... పురుషుల ఆధిపత్యం ఎక్కువై.. మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే... లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని ప్రతిపాదిస్తుంది. 33శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
బిల్లు మొదటిసారి ఎప్పుడు తీసుకొచ్చారు?
దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సెప్టెంబర్ 12, 1996న 81వ సవరణ బిల్లుగా లోక్‌సభలో తొలిసారిగా దీనికి ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లు సభ ఆమోదం పొందలేదు. లోక్‌సభలో బిల్లు రద్దయ్యింది. అటుపై.. రెండేళ్ల తరువాత, అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998లో... 12వ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అప్పటి ప్రధాని వాజ్‌పేయి... 1998లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గట్టిగా వాదించారు. అయితే, అప్పుడు కూడా బిల్లుకు తగిన మద్దతు లభించలేదు. దీంతో లాప్ అయ్యింది. ఇదే వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999, 2002, 2003లో తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ అప్పుడూ బిల్లు పాస్ కాలేదు.
దాదాపు ఐదేళ్ల తర్వాత, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపీఏ-1 ప్రభుత్వం.. మే 6, 2008న రాజ్యసభలో తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. మే 9, 2008న బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 17, 2009న సమర్పించింది. ఈ నివేదికకు 2010, ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర లభించింది. చివరికి మార్చి 9, 2010న మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో 186-1 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే, లోక్‌సభలో మాత్రం ఎప్పుడూ పరిశీలనకు తీసుకోబడలేదు. 2014లో 15వ లోక్‌సభ రద్దవడంతో అక్కడితో ముగిసిపోయింది. ఆ సమయంలో, RJD-సమాజ్‌వాదీ పార్టీలు మహిళలకు కులాల వారీగా రిజర్వేషన్లు డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.
భారతదేశంలో మహిళలకు రాజకీయ రిజర్వేషన్ ఉందా?
భారతదేశంలో పంచాయతీ రాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఉంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం అందించబడింది. 1992లో.. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదించబడింది. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలు, అణగారిన వర్గాలకు 33.3 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి. చారిత్రాత్మక సవరణ ద్వారా 14.5 లక్షలకు పైగా మహిళలు నాయకత్వ స్థానాలను స్వీకరించి స్థానిక పాలనలో భాగమయ్యారు. నేడు.. 21 రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాయి. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం ఎంత?
17వ లోక్‌సభలో ఇప్పటివరకు అత్యధికంగా 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఇది మొత్తం లోక్‌సభ బలంలో దాదాపు 15.21 శాతం. 2022లో ప్రభుత్వ డేటా ప్రకారం రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 14 శాతం. 2014లో అంటే 16వ లోక్‌సభలో మొత్తం 11.87 శాతం అంటే 68మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రకారం 47.27 కోట్ల మంది పురుషులు, 43.78 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో, పురుషుల భాగస్వామ్యం కంటే 67.18 శాతం మహిళా ఓటరు భాగస్వామ్యం ఎక్కువగా ఉంది.