ఏపీలో చంద్రబాబు అరెస్టు అంశం పార్లమెంటును చేరింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో అన్నారు.  ప్రధాని మోదీ జోక్యం చేసుకొని ఆయన బయటకు వచ్చేలా చూడాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. గల్లాదేవ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హాయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని, అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అన్నారు. మిథున్ రెడ్డి కౌంటర్ ఇస్తుండగా.. గల్లా జయదేవ్ కలగజేసుకొనే ప్రయత్నం చేయగా ‘నువ్వు మాట్లాడావ్ ఇక కూర్చో’ అంటూ వైసీపీ ఎంపీ తేల్చి చెప్పారు. 


‘‘చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు చౌకబారు కుట్రలు పన్నారు. స్కిల్‌ కేసులో రూ.371 కోట్లు విడుదల చేశారన్నది ప్రధాన ఆరోపణ. చంద్రబాబుకు డబ్బు అందినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపేలా ప్రధాని చర్యలు తీసుకోవాలి. చంద్రబాబును వెంటనే విడుదల చేసేలా ప్రధాని చొరవ చూపాలి. 


ఐటీ రంగాన్ని చంద్రబాబు ప్రోత్సహించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. ఎన్నో సంస్కరణలతో చంద్రబాబు చాలా ప్రగతి సారథిగా నిలిచారు. చంద్రబాబును అరెస్టు చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్‌ డేగా నిలిచిపోయింది. ఏపీలో అధికార పార్టీ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కిన తీరును ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకొస్తున్నా’’ అని గల్లా జయదేవ్ మాట్లాడారు.