Justice Hema Committee Reprt | హేమ కమిటీ నివేదిక పేరుతో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం మానుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి సురేశ్ గోపి అన్నారు. సంచనాల కోసం ఎప్పుడూ ఎవరో ఒకరిపై బురదజల్లడం మానుకోవాలని మీడియాకు ఆయన హితవు పలికారు. కోర్టులకన్నా ముందే మీడియా తీర్పులు చెప్పేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు మంచిది కాదన్నారు. మీ లాభం కోసం ప్రముఖులను టార్గెట్ చేయడం తగదన్నారు. స్వయంగా సీనియర్ నటుడైన సురేశ్ గోపి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
2017లో నటిపై దాడి కేసు తర్వాత కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని నియమించింది. మళయాళ చిత్రపరిశ్రమలో మహిళలపై జరుగుతున్న దారుణాలను వెలికితీసేందుకు కేరళ ప్రభుత్వం హేమ కమిటీని నియమించింది. వారు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవస్థాగతంగా మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు, దోపిడీలను తెలుసుకుని వారికి న్యాయం చేసే దిశగా ఈ కమిటీ దృష్టిసారించింది. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రముఖ దర్శకులు, నటులు, నిర్మాతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రముఖుల పేర్లు బయటకొస్తుండటంతో జస్టిస్ హేమ కమిటీ విచారణపై మరింత ఆసక్తి నెలకొంటోంది. వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మళయాళ నటుడు రంజిత్ ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఐ (ఎం) పార్టీ ఎమ్మెల్యే ఎం ముఖేష్ రాజీనామా చేయాలని బీజేపీ యువ మోర్చా డిమాండ్ చేసింది. కొల్లంలోని ఎమ్మెల్యే ఇంటి వరకు యువ మోర్చ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వెంటనే ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని సీఎం పినరయి విజయన్‌ను బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న వారిని సీఎం పి విజయన్ కాపాడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
అయితే ఒకవైపు కేరళ ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు చేస్తుండగా, ఆ పార్టీకే చెందిన కేంద్ర మంత్రి సురేశ్ గోపి మాత్రం హేమ కమిటీపై అసహనం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉంది. మీడియా ప్రచారం కోసం హడావుడి చేస్తుందంటూ, ఇవన్నీ తమ కడుపు నింపుకోవడానికేనని ఆయన ఆరోపించారు.
Also Read: Kolkata Doctor Case: కోల్‌కతా పోలీస్ కమిషనర్ పేరుతో అత్యాచార నిందితుడి బైకు రిజిస్ట్రేషన్!