Kolkata RG KAR Hospital | ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హ‌త్యాచారం కేసులో ఆశ్చర్యకరమైన ఆరోపణ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంజ‌య్ రాయ్ ఉప‌యోగిస్తున్న బైకు క‌ల‌క‌త్తా పోలీస్ క‌మిష‌న‌ర్ పేరుతో రిజిస్ట‌ర్ అయి ఉంద‌ని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిందితుడికి పోలీస్ శాఖ అండ‌దండ‌లు ఉన్నాయ‌న‌డానికి ఇంత‌క‌న్నా మ‌రే సాక్ష్యం అవ‌స‌రం లేద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ, టీఎంసీ పార్టీలు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటున్నాయి.


ఒక పోలీస్ ఇన్ఫార్మ‌ర్ పోలీసుల పేరుతో రిజిస్ట‌ర్ చేయ‌బ‌డి ఉన్న బైకుల‌పై ఎలా తిరుగుతాడ‌ని బీజేపీ ప్ర‌శ్నిస్తుంది. ఆధారాలు లేకుండా చేసి ఈ కేసును నీరుగార్చాల‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్రయ‌త్నిస్తున్నార‌ని బీజేపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. పోలీస్ క‌మిష‌న‌ర్‌కు కేటాయించిన బైకుల‌పై నిందితులు యథేచ్చ‌గా తిరుగుతున్నార‌ని కాషాయ పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ త‌క్ష‌ణ రాజీనామా చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ ద‌ర్యాప్తున‌కు కూడా చిక్కుకుండా ఇప్ప‌టికే సాక్ష్యాల‌ను మాయం చేశార‌ని, వారు ఇలాగే ప‌ద‌విలో కొన‌సాగితే బాధితురాలికి న్యాయం జ‌ర‌గ‌ద‌ని ఆరోపిస్తున్నారు. 


వైరల్ అవుతోన్న సోషల్ మీడియా పోస్ట్
రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ అధ్య‌క్షుడు అమిత్ మాలవీయ ఇదే అంశంపై సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రిలో జూనియ‌ర్ డాక్ట‌ర్ హ‌త్యాచారానికి గురైన రోజు నిందితుడు సంజ‌య్ రాయ్ తిరిగిన బైకు పోలీస్ క‌మిష‌న‌ర్ పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయ‌బ‌డి ఉంద‌ని బాంబ్ పేల్చారు. అదే క‌మిష‌న‌ర్ బాధితురాలి మ‌ర‌ణం అత్యాచారం కాద‌ని, ఆత్మ‌హ‌త్య‌గా మొద‌ట ప్ర‌చారం చేశార‌ని అమిత్ ఆరోపించారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సూచ‌న‌ల ప్ర‌కారం క‌మిష‌న‌ర్ న‌డుచుకుంటున్నార‌ని తెలిపారు. 


బైకు రిజిస్ట్రేష‌న్ కు సంబంధించి సీబీఐ ద‌ర్యాప్తులో ఈ విష‌యం వెల్ల‌డైన‌ట్టుగా మొద‌ట ఇండియా టుడే క‌థ‌నాన్ని ప్రసారం చేసింది. దాన్ని ప‌ట్టుకుని కాషాయ పార్టీ పోలీస్ శాఖ‌పై ఆరోప‌ణ‌లు చేస్తోంది. కాగా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ బైకు రిజిస్ట్రేష‌న్ అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో క‌ల‌క‌త్తా పోలీసులు స్పందించారు. సోష‌ల్ మీడియా జ‌రుగుతున్న ప్ర‌చారం వాస్త‌వం కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. 
ఫేక్ వార్తలు ప్ర‌చారం చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు.


పోలీస్ శాఖ‌కు చెందిన అన్ని ప్ర‌భుత్వ వాహ‌నాలు పోలీస్ క‌మిష‌న‌ర్ పేరుతోనే రిజిస్ట్రేష‌న్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని అఫీషియ‌ల్ ఎక్స్ అకౌంట్ నుంచి పోలీసులు వివ‌ర‌ణ ఇచ్చారు. రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన త‌ర్వాతనే ఆయా విభాగాల‌కు పంపుతామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. 

నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంజ‌య్ రాయ్ ఉప‌యోగిస్తున్న బైకు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ పేరుపై రిజిస్ట్రేష‌న్ చేసి ఉంద‌నే అంశాన్ని మొద‌టగా ABP News ఏపీబీ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఆ బైకును పోలీస్ ఇన్ఫార్మ‌ర్‌కు కేటాయించ‌డంపై పోలీస్ శాఖ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ బైకుపై సంజ‌య్ రాయ్ తిరిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 
విచార‌ణ‌లో భాగంగా సీబీఐ ఆ బైకును స్వాధీనం చేసుకుంది.