Haryana Home Minister: హరియాణా గత కొంత కాలంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటిమయం అయ్యాయి. ఈక్రమంలోనే అంబాలాలోని హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ నివాసం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇంటి పరిసరాలన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు సిబ్బందికి కూడా ఇంట్లోకి వెళ్లేందుకు కష్టం అవుతోంది. మోకాళ్ల లోతు నీటిలోనే ప్రయాణం సాగిస్తున్నారు. రెసిడెన్షియల్ కాలనీలో ఒక వ్యక్తి విద్యుదాధాతానికి గురయ్యాడు. మరో ఘటనలో అంబాలా నగరంలో మూడు మృతదేహాలు నీటిలో తేలాయి.






హరియాణా పంజాబ్‌లోనూ వరదలు సవాల్‌గా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. రూప్‌నగర్, పటియాలా, మొహాలి, అంబాలా, పంచ్‌కుల ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. హోషియార్‌పూర్‌లో ఇల్లు కూలిన ఘటనలో ఓ 75 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. సుల్తాన్‌పూర్‌లో వరద నీటిలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లోని 370 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. హరియాణాలోని గగ్గర్ నది పోటెత్తుతోంది. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా చెరువులు, నదులు ప్రమాదకర స్థాయిలో ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది 206 మీటర్ల లెవెల్ దాటి ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలిస్తున్నారు.






 హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరరియల్ సర్వే నిర్వహించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం హరియాణా పొరుగున్న పంజాబ్ లో వర్షాలకు సంబంధించిన పలు సంఘటనల్లో దాదాపు 15 మంది మరణించారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ త్వరలోనే అంబాలాను సందర్శించినున్నట్లు అధికారులు చెబుతున్నారు. 






మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు


జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనే వరదల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి. హిమాచల్‌లోని కసోల్, మణికరన్, ఖీర్ గంగ, పుల్గా ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి.