Gyanvapi Masjid Case: 



సర్వేకి కోర్టు అంగీకారం..


జ్ఞానవాపి మసీదు కేసులో ఆసక్తికర పరిణామం జరిగింది. మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే చేసేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. Archaeological Survey of India (ASI) నేతృత్వంలో మసీదులో సర్వే చేసేందుకు అంగీకరించింది. అయితే...వాజూఖానా ప్రాంతంలో మాత్రం సర్వే చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక్కడే శివలింగం ఉందని హిందూ సంఘాలు చెబుతున్నాయి. కానీ...ఈ ప్రాంతాన్ని సర్వే పరిధిలోకి తీసుకురాకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఓ హిందూ సంఘం వేసిన పిటిషన్‌ని విచారించిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. జులై 14వ తేదీనే వాదనలు విన్న కోర్టు...అన్నీ పరిశీలించి సర్వేకి అనుమతి తెలిపింది. హిందువుల తరపున పిటిషన్ వేసిన విష్ణు శంకర్ జైన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. హిందువుల తరపున వాదించిన అడ్వకేట్ సుభాష్ నందన్ చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఈ కేసులో టర్నింగ్ పాయింట్ అవుతుందని అన్నారు. 


"మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజీ సర్వే జరపాలని నేను పెట్టుకున్న అప్లికేషన్‌ని కోర్టు అంగీకరించింది. వజూఖానా ప్రాంతంలో కాకుండా మిగతా అన్ని చోట్ల ASI సర్వే చేసేందుకు అనుమతినిచ్చింది"


- విష్ణు శంకర్ జైన్, పిటిషనర్ 







ఈ ఏడాది మే నెలల హిందువుల తరపున ఈ పిటిషన్ దాఖలైంది. ఐదుగురు మహిళలు ఈ పిటిషన్ వేశారు. సర్వే చేయడంతో పాటు మసీదులోని శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరారు. అంతే కాదు. ఈ మసీదు గోడ అవతల ఉన్న వినాయకుడు, హనుమంతుడు, నంది విగ్రహాలకూ పూజలకు పర్మిషన్ కావాలని అడిగారు. అయితే..ఈ పిటిషన్ విచారణలో మసీదు కమిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హిందువులు చెబుతున్నట్టుగా ఔరంగజేబు ఇక్కడి ఆలయాన్ని కూలగొట్టి మసీదు కట్టారన్నది కేవలం నిరాధార ఆరోపణలు అని వాదించింది. ఆదివిశ్వేశ్వర ఆలయంపై ముస్లింలు దాడి చేయగా...ఆ తరవాత రాజా తొండల్ మల్ ఆలయాన్ని పునరుద్ధరించారన్న వాదననూ కొట్టి పారేసింది. మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించలేదని తేల్చి చెప్పింది. గతేడాది మే 16న స్థానిక కోర్టు పర్యవేక్షణలో వీడియో సర్వే నిర్వహించారు. మసీదులోపల శివలింగం కనిపించిందని సర్వేలో తేలింది. ముస్లింలు మాత్రం అది వాటర్ ఫౌంటేన్‌లో ఓ శకలమే అని వాదిస్తున్నారు. వజూకానా ప్రాంతంలో ప్రార్థనలకు ముందు కాళ్లు చేతులు కడుక్కోడానికి ఇది ఏర్పాటు చేశారని చెబుతున్నారు. మే 19వ తేదీన సుప్రీంకోర్టు ఆర్కియాలజీ సర్వే చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కానీ వారణాసి కోర్టు అందుకు భిన్నంగా అనుమతినిచ్చింది. 


Also Read: Microsoft Layoffs: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్, సమాచారం ఇవ్వకుండానే లేఆఫ్‌లు