Gujarat Rains: భారీ, అతి భారీ వర్షాలతో గుజరాత్ రాష్ట్రం అల్లాడిపోతోంది. ఎడతెరిపిలేకుండా దట్టంగా కురుస్తున్న వానలతో గుజరాత్ చిగురుటాకులా వణుకుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో వాన కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గడిచిన కొన్ని గంటల్లోనే ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుజరాత్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల నీళ్లు నడుము లోతు వరకు చేరాయి. కార్లను చెరువులో పార్క్ చేసినట్లుగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 


గిర్ సోమనాథ్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మొదలమైన భారీ వర్షం 14 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. 345 మిల్లీ మీటర్ల వర్షం కురిసి రికార్డు నమోదు చేసింది. రాజ్ కోట్ జిల్లాలో కేవలం 2 గంటల వ్యవధిలోనే 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు సూరత్ లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. జునాగఢ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. భారీ నీటి ప్రవాహం కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని 206 జలాశయాల్లో 43 కు హై అలర్ట్ ప్రకటించారు. మరో 18 జలాశాలను అలర్ట్ మోడ్ లో ఉంచారు. 19 రిజర్వాయర్లకు గుజరాత్ సర్కారు హెచ్చరికలు కూడా జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం - NDRF, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు- SRDF సంసిద్ధంగా ఉన్నాయి.