Jammu and Kashmir:


వరుసగా రెండు సార్లు..


జమ్ముకశ్మీర్‌లో వారం రోజుల్లో రెండు సార్లు ఉగ్రదాడులు కలకలం రేపాయి. వలస కూలీలను టార్గెట్‌గా చేసుకుని పదేపదే దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. వాళ్లపై కాల్పులు జరుపుతున్నారు. మరోసారి అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇద్దరు కూలీలపై కాల్పులు జరపగా...ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతానికి వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ అటాక్ జరిగిన ప్రాంతంలో పహారాను పెంచారు పోలీసులు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. 


"అనంత్‌నాగ్‌లోని ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వాళ్లను ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతానికి వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉంది"


- కశ్మీర్ జోన్ పోలీస్




గత వారం..


గత వారం ఇలాంటి ఘటనే జరిగింది. షోపియన్ జిల్లాలో ముగ్గురు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అటు పోలీసులు కూడా ముష్కరులకు గట్టి బదులే ఇస్తున్నారు. ఎక్కడికక్కడ సెర్చ్ ఆపరేషన్‌లు నిర్వహిస్తూ ఉగ్రవాదులను ఏరేస్తున్నారు. ఇటీవలే పూంఛ్‌లోని సింధారా ఏరియాలో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ముందుగానే ఉగ్రదాడులను పసిగట్టి ఎన్‌కౌంటర్ చేశారు. ఆపరేషన్ త్రినేత్రలో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ చేసినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి.