సూరత్: హిందూ ధార్మిక సంస్థ నాయకుడిని హత్య చేసేందుకు ప్లాన్ చేసిన నిందితుడ్ని గుజరాత్ లోని సూరత్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ సనాతన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రాణా హత్యకు కుట్ర, సుదర్శన్ టెలివిజన్ ఛానల్ చీఫ్ ఎడిటర్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మలపై బెదిరింపులకు పాల్పడిన మౌల్వీ సోహెల్ అబుబకర్ తిమోల్ (27)ను సూరత్ పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారని సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు. 


ఉపదేశ్ రాణా హత్యకు ప్లాన్
సూరత్ సీపీ అనుపమ్ సింగ్ గెహ్లాట్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు మౌల్వీ సోహెల్ అబుబకర్ తిమోల్ థ్రెడ్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా చేస్తున్నాడు. ముస్లిం చిన్నారులకు ఇస్లాం గురించి ప్రైవేట్ ట్యూషన్ చెప్పేవాడు. హిందూ సనాతన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రాణా హత్యకు నిందితుడు ప్లాన్ చేశాడు. అందుకోసం పాకిస్తాన్‌, నేపాల్‌కు చెందిన వ్యక్తులకు కోటి రూపాయల సుపారీ ఆఫర్ చేశాడు. పాక్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సైతం ప్లాన్ చేశాడని సీపీ తెలిపారు. సోహెల్ అబుబకర్ తిమోల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ లో ఈ వివరాలను గుర్తించినట్లు సీపీ గెహ్లాట్ పీటీఐకి తెలిపారు.  


ఫేక్ నెంబర్లతో బెదిరింపులు 
నిందితుడు టిమోల్ ఈ ఏడాది మార్చిలో ఉపదేశ్ రాణాను హత్య చేస్తానని బెదిరించాడు. లావోస్ నుంచి వర్చువల్ నంబర్‌ను ఉపయోగించి తన గ్రూప్ కాల్‌లో పాకిస్తాన్, నేపాల్ నుంచి నంబర్‌లను కనెక్ట్ అయి బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు కనుగొన్నారు. నిందితుడి మొబైల్ లో ఉన్న వివరాలు గమనిస్తే.. సుదర్శన్ టీవీ చీఫ్ ఎడిటర్ సురేశ్ చవాన్కే, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, నుపూర్ శర్మలను బెదిరించేందుకు ప్లాన్ చేశాడని గుర్తించారు. హిందూ నేతల్ని అంతం చేయడంపై నిందితుడు తమ గ్యాంగ్ తో తరచుగా చర్చించాడు. 


కమలేష్ తివారీలాగే హత్య చేస్తామని వార్నింగ్ 
లక్నోలో అక్టోబర్ 18, 2019 హత్యకు గురైన ఉత్తరప్రదేశ్ కు చెందిన హిందూ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ తివారీ హత్య గురించి చర్చించారని సీపీ గెహ్లాట్ చెప్పారు. రాణాను హత్య చేయడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మతసామరస్యానికి భంగం కలిగించేందుకు నిందితుడు టిమోల్ భారీ కుట్రకు తెరలేపాడు. పాకిస్తాన్, నేపాల్‌కు చెందిన ఫోన్ నంబర్లు ఉన్న డోగర్, షెహనాజ్ అనే ఇద్దరు వ్యక్తులను నిందితుడు సంప్రదించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.   


కోటి రూపాయల సుపారీ
నిందితుడు టిమోల్ తన గుర్తింపును రహస్యంగా ఉంచేందుకు లావోస్ నుంచి అంతర్జాతీయ సిమ్ నంబర్‌ను తీసుకున్నాడు. సోషల్ మీడియాలో బిజినెస్ నంబర్‌ను యాక్టివేట్ చేసిన అనంతరం.. కమలేశ్ తివారీ లాగ నిన్ను హత్య చేస్తామంటూ ఉపదేశ్ రానాను పలుమార్లు బెదిరించాడు. రాణా హత్యకు కోటి రూపాయల సుపారీ ఇస్తున్నట్లు సాక్ష్యాలు సైతం మొబైల్ లో లభ్యమయ్యాయి. నిందితుడు టిమోల్ పాక్, వియత్నాం, ఇండోనేషియా, కజకిస్తాన్, లావోస్ వంటి ఏరియా కోడ్‌లతో వాట్సాప్ నంబర్లు ఉన్నవారితో సంప్రదింపులు జరిపాడు. 


నిందితుడు సోహెల్ అబుబాకర్ టిమోల్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 153 (A) (మతం, జాతిపై దూషణలు లేక దాడులకు పాల్పడడం), 467, 468, 471 (నకిలీ పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డులు కలిగి ఉండటం)తో పాటు సెక్షన్ 120 (B) నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సూరత్ సీపీ గెహ్లాట్ వివరించారు.