సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై అఖిల పక్ష సమావేశం జరిగింది. పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో ఆదివారం సాయంత్రం అఖిలపక్షం భేటీ జరిగింది. ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై అన్ని పార్టీలకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ సందర్భంగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరింది అధికార పార్టీ. విపక్షాలు మహిళా బిల్లు గురించి ప్రస్తావించాయని, అయితే ప్రభుత్వానికి సొంతం ఎజెండా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. 


మరోవైపు సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రాంతీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ప్రవేశపెట్టి, వాటికి ఆమోదం తెలపాలని బిజు జనతాదళ్‌ , భారత్‌ రాష్ట్ర సమితి పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక ఘర్షణలతోపాటు మణిపుర్‌లో పరిస్థితి వంటి అంశాలను లేవనెత్తుతామని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ స్పష్టం చేశారు. 


లోక్‌సభలో ఉప సభాపక్షనేత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభ పక్షనేత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి హజరయ్యారు. కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఛౌదరి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, డీఎంకే కనిమొళి, టీడీపీ రామ్‌మోహన్‌ నాయుడు, టీఎంసీ డెరెక్‌ ఒబ్రెయిన్‌, ఆప్‌ తరఫున సంజయ్‌ సింగ్‌, బీజేడీ సస్మిత్‌ పాత్ర, బీఆర్‌ఎస్‌ నుంచి కే కేశవరావ్‌, ఆర్‌జేడీ మనోజ్‌ షా, ఎస్పీ నుంచి రామ్‌గోపాల్‌ యాదవ్‌లు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.


19వ తేదీన కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్న నేపథ్యంలో 18న 75ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభలు వెల్లడించాయి. ఇండియా పేరును భారత్ గా మారుస్తారన్న వార్తలు వస్తుండటంతో...విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 5 బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.. ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించిన ది అడ్వకేట్స్‌ సవరణ బిల్లు-2023, ద ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2023, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బిల్లులు లోక్‌సభ ముందుకు రానున్నాయి.