Laptop Imports: ల్యాప్‌టాప్‌ల, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులను పర్యవేక్షించడానికి భారత్ ‘ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం’ పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఈ వర్గానికి చెందిన మెషిన్ల దిగుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈ ఆగస్టులో ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏర్పడిన అనిశ్చితిని తగ్గించడానికి ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం సహాయపడనుంది. 


దీనిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం స్పందిస్తూ.. ఇకపై దిగుమతిదారులు కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఇంపోర్ట్ ఆథరైజేషన్ కోరవలసి ఉంటుందని, ఇది ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ ఫార్మాట్‌లో జారీ చేయబడుతుందని పేర్కొంది. ఇందులో దిగుమతి చేసుకునే పరిమాణం, వాటి విలువను తెలియజేయాల్సి ఉంటుంది. అవి కూడా సెప్టెంబర్ 30, 2024 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. దిగుమతిదారుడు మల్టిపుల్ ఆథరైజేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని, దిగుమతి చేసుకునే వస్తువుల విలువలో మార్పు లేనప్పుడు పరిమాణాన్ని మార్చుకోవచ్చని పేర్కొంది.
 
కొత్తగా ప్రతిపాదించబడిన ఈ దిగుమతి నిర్వహణ వ్యవస్థ, ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఇది ఏడు రకాల కమ్యూనికేషన్ టెక్నాలజీ, హార్మోనైజ్డ్ కోడ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు, కంప్యూటర్లు, సర్వర్లకు సంబంధించిన సామగ్రిని గుర్తించేలా ఉంటాయి. దిగుమతిదారుల సమస్యల పరిష్కారం, సందేహాల నివృత్తికి ప్రతి మంగళవారం ఉదయం 10:30 గంటలకు DGFT ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.


వీటికి మినహాయింపులు


దిగుమతులపై ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇచ్చింది. ప్రత్యేక ఆర్థిక జోన్‌లో తయారైన IT హార్డ్‌వేర్‌ను దేశీయ టారిఫ్ ప్రాంతంలోకి దిగుమతి చేసుకున్నప్పుడు దానికి మినహాయింపు ఉంటుంది. SEZ యూనిట్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్కులు, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు, బయో-టెక్నాలజీ పార్కులు నోటిఫైడ్ ఐటీ హార్డ్‌వేర్ దిగుమతికి అధికారాన్ని పొందాల్సిన అవసరం లేదు.


IT హార్డ్‌వేర్ పరికరాలకు అవసరమైన విడిభాగాలు, భాగాలు, అసెంబ్లింగ్, ఉప-అసెంబ్లింగ్ భాగాలపై దిగుమతి పరిమితులు ఉండవు. IT హార్డ్‌వేర్ మూలధన వస్తువులో ముఖ్యమైన భాగం అయితే మినహాయింపు ఉంటుంది. MRI యంత్రాలు, CNC యంత్రాలు, మానవరహిత వైమానిక వాహనాలు మొదలైన యంత్రాలతోపాటు ల్యాప్‌టాప్‌లు/టాబ్లెట్‌లు దీని కిందకు వస్తాయి. అయితే సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు ప్రాథమిక మూలధన వస్తువులు అయితే ఈ మినహాయింపు వర్తించదు.


ఇతర మినహాయింపులు


రక్షణ, భద్రతా ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల తరఫున ప్రైవేట్ సంస్థలు చేసే ఏదైనా దిగుమతికి మినహాయింపు ఉంటుంది. గతంలో విక్రయించిన IT హార్డ్‌వేర్‌ను రిపేర్ చేయడం/ వాపసు చేయడం/ రీప్లేస్ చేయడం కోసం వస్తువును దిగుమతి చేసుకున్నప్పుడు, విదేశాల్లో రిపేర్ చేసిన రీ-ఇంపోర్ట్ విషయంలో దానికి మినహాయింపు ఉంటుంది.


R&D, టెస్టింగ్, బెంచ్‌ మార్కింగ్, టెస్టింగ్, ఉత్పత్తి అభివృద్ధి ప్రయోజనాల కోసం దిగుమతి చేసుకునే వాటికి, బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యేవాటికి  మినహాయింపు ఉంటుంది. అలాగే ఈ కామర్స్ పోర్టల్ నుచి కొనుగోలు చేసే, ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్, అల్ట్రా-స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్‌కు ఈ మినహాయింపులు వర్తిస్తాయి.