Telecom Ministry: 



టెలికాం శాఖ కీలక ప్రకటన..


కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై సిమ్ కార్డ్ డీలర్స్‌పై పోలీస్ వెరిఫికేషన్ చేస్తామని వెల్లడించారు. బల్క్ కనెక్షన్‌లు తీసుకున్న వారి డిస్‌కంటిన్యూ చేస్తామని తెలిపారు. ఇలాంటి కనెక్షన్లతోనే భారీ మోసాలు జరుగుతున్నాయని, అందుకే వాటిపై దృష్టి సారించామని చెప్పారు. ఇలాంటి క్రైమ్స్‌లో ఇన్వాల్వ్ అయిన 52 లక్షల కనెక్షన్స్‌ని ఇప్పటికే డీయాక్టివేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలీస్‌ వెరిఫికేషన్‌తో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తైన తరవాతే సిమ్ డీలర్స్‌కి అనుమతినిచ్చేలా నిబంధనలు తీసుకు రానున్నట్టు అశ్వినీ వైష్ణవ్ వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలూ విధిస్తామని హెచ్చరించారు. 


"కొత్త సిమ్ డీలర్స్ ఎవరైనా సరే ఇకపై పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నాం. దాంతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ కూడా తప్పనిసరి. ఆల్ పాయింట్ ఆఫ్ సేల్ డీలర్స్ కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తాం"


- అశ్వినీ వైష్ణవ్, కేంద్ర టెలికాం మంత్రి 






సంచార్ సాతీ పోర్టల్..


ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సంచార్ సాతీ (Sanchar Saathi) పోర్టల్‌ని ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా 52 లక్షల కనెక్షన్స్‌ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు తేలింది. వెంటనే వాటిని గుర్తించి డీయాక్టివేట్ చేసింది. అక్రమంగా సిమ్‌ కార్డులు అమ్ముతున్న 67 వేల మంది డీలర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ ఏడాది మే నుంచి 300 సిమ్ కార్డ్ డీలర్స్‌పై కేసులు నమోదు చేసింది కేంద్రం. 




"గతంలో చాలా మంది బల్క్‌లో సిమ్ కార్డులు కొనే వాళ్లు. అప్పుడు అలా వీలుండేది. కానీ...ఇకపై ఈ ప్రొవిజన్‌ని  తీసేయాలనుకుంటున్నాం. అందుకు బదులుగా కొత్త ప్రొవిజన్ అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ మార్పుతో ఇకపై ఫేక్ కాల్స్‌ బెడద తగ్గిపోతుంది. దేశవ్యాప్తంగా 10 లక్షల సిమ్ డీలర్స్ ఉన్నారు. పోలీస్ వెరిఫికేషన్‌కి సరిపడా సమయం ఇస్తాం. టెలికాం శాఖ బల్క్ కనెక్షన్స్‌ ప్రొవిజన్‌ని తొలగించింది. బిజినెస్ కనెక్షన్ పేరుతో కొత్త ప్రొవిజన్ తీసుకొచ్చింది"


- అశ్వినీ వైష్ణవ్, కేంద్ర టెలికాం మంత్రి