Nehru Memorial Renaming: 


ప్రధాని మెమోరియల్ మ్యూజియం..
 
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (Nehru Memorial Museum and Library) పేరుని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎంపీ రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. నెహ్రూకి పేరుతో పని లేదని, ఆయన చేసిన పనులే ఎంతో గౌరవం తెచ్చి పెట్టాయని అన్నారు. ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు రాహుల్ గాంధీ. రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలూ బీజేపీపై మండి పడ్డారు. కేవలం నెహ్రూ విధానాలు వ్యతిరేకించడం తప్ప బీజేపీ చేస్తోంది ఏమీ లేదని విమర్శించారు జైరాం రమేశ్. ప్రధాని మోదీకి అభద్రతా భావం పెరిగిపోతోందని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని సెటైర్లు వేశారు. 






"ప్రధాని మోదీకి భయం పట్టుకుంది. అభద్రతా భావం పెరిగిపోతోంది. ముఖ్యంగా మన దేశ తొలి ప్రధాని నెహ్రూ విషయంలో చాలా గాబరా పడిపోతున్నారు. మోదీకున్న ఎజెండా ఒక్కటే. నెహ్రూ విధానాలను విమర్శించడం. ఆయనను అవమానించడం. పదేపదే తప్పు పట్టి ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించడం. అందుకే నెహ్రూ మ్యూజియం పేరులలో N అక్షరాన్ని తొలగించి P అని చేర్చారు"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 






కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా పేరు మార్చడంపై అసహనం వ్యక్తం చేశారు. చరిత్రను తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 


"ఇది నిజంగా దురదృష్టకరం. మన చరిత్రను అవమానిస్తున్నారు. ఇంత భారీ మెజార్టీ ఉన్న ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాదిది. ఇంత మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి"


- శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ


ఈ విషయంలో కాంగ్రెస్‌కి మద్దతుగా నిలిచింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఇది సిగ్గుచేటు అంటూ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మండి పడ్డారు. చనిపోయిన వాళ్ల పేరుని ఎంతో గౌరవంగా ఆ మ్యూజియంకి పెట్టారని, ఇప్పుడా పేరుని మార్చడం సరికాదని తేల్చి చెప్పారు. 


"ఇది సిగ్గు చేటు. చనిపోయిన వాళ్లను గౌరవించడం మన హిందూ సంస్కృతిలో భాగం. జవహర్ లాల్ నెహ్రూ మన దేశ తొలి ప్రధాని. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. దేశం కోసం చాలా చేశారు. కానీ..బీజేపీ మాత్రం దీన్ని రాజకీయం చేస్తోంది'


- సౌరభ్ భరద్వాజ్, ఆప్ మంత్రి 


Also Read: First Biodiversity Village: దేశంలోనే తొలి జీవవైవిధ్య గ్రామం అట్లాస్ లాంచ్ చేసిన గోవా సర్కారు