Goa Tourism: గోవా పేరు చెప్పగానే బ్యూటిఫుల్ బీచెస్.. కలర్ఫుల్ నైట్స్.. సరదాగా ఉండే కల్చర్ గుర్తొస్తాయి. దానితో టూరిస్ట్‌్లు హాలిడేస్ లో గోవాకు పోటెత్తేవారు. అయితే అదంతా గతం. ప్రస్తుతం గోవా టూరిస్టులు లేక వెలవెల పోతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ అంటే చాలు విపరీతమైన టూరిస్టుల రద్దీతో బిజీగా ఉంటే గోవా ఇప్పుడు బిత్తర చూపులు చూస్తోంది. కొన్ని అధికారిక లెక్కల ప్రకారం 2019లో దాదాపు 10 లక్షల మంది విదేశీ టూరిస్టులు గోవాలో పర్యటిస్తే 2023లో అది 4లక్షలకు పడిపోయింది. ప్రతీ యేటా హాలిడేస్‌కు గోవా వచ్చే విదేశీ టూరిస్టులు ఇప్పుడు ఛలో థాయిలాండ్, వియత్నాం, శ్రీలంక, మారిషస్ అంటున్నారు. దేశీయ టూరిస్టుల నెంబర్ కూడా ఇలానే పడిపోయింది. ఈ డ్రాప్‌నకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!


1970ల్లో మొదలైన గోవా టూరిజం హవా 
చాలా కాలం పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవా 1961లో ఇండియాలో విలీనమైంది. అప్పటి నుంచి హిప్పీలకు అడ్డాగా మారింది. స్థానికంగా ఉన్న కొంకణ్, పోర్చగీస్ పద్ధతులకు హిప్పీ కల్చర్ కూడా తోడై గోవాలో ఒక సరదా, ఎంజాయ్ ఫుల్ వాతావరణం ఏర్పడింది. 1987లో గోవాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి టూరిజం డెవలప్మెంట్‌కు చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. తనతో 1990 తర్వాత వెకేషన్‌ల కోసం యూరప్ రష్యాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్ట్‌లు రావడం మొదలుపెట్టారు. సినిమాల షూటింగ్‌లు కూడా ఎక్కువగా జరిగేవి. వాటి ద్వారా గోవా కల్చర్ పాపులర్ కావడంతో దేశీయ టూరిస్ట్‌లు కూడా గోవా కల్చర్ ఎంజాయ్ చేయడం కోసం క్యూ కట్టేవారు. ఒక్కసారైనా గోవా వెళ్లి రావాలనేది కాలేజ్ డేస్ లో చాలామందికి ఒక డ్రీమ్. ఇవన్నీ గోవాను టూరిజంపరంగా టాప్ ప్లేస్‌లో నిలబెట్టాయి. గోవా జిడిపిలో 17శాతానికిపైగా ఆదాయం టూరిజం ద్వారానే వస్తుంది. అయితే ఇప్పుడు ఆ బంగారు బాతును అక్కడి స్థానికులే చేజేతులా చంపేసుకుంటున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి.


గోవాలో "టాక్సీ మాఫియా "
గోవా టూరిస్టులకి మొదట ఎదురయ్యే సమస్య టాక్సీల దగ్గర నుంచే. మామూలుగా ఇతర రాష్ట్రాల్లో తిరిగే క్యాబ్ సర్వీసులు అక్కడ ఉండవు. లోకల్ టాక్స్‌లనే బుక్ చేసుకోవాలి. అంతా ఒక సిండికేట్ ఏర్పడి విపరీతమైన చార్జీలు వసూలు చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. సింగిల్‌గా వెళితే ఓకేగాని ఫ్యామిలీతో వెళ్లిన వాళ్లకు ఇది ఇబ్బందిగా మారుతోంది.


భారంగా మారిన హోటల్ చార్జీలు 
గోవాలో కాస్త బాగుండే టూ స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవాలంటే నైట్‌కు 6 నుంచి 7వేలు చెల్లించాల్సిందే. అదే ఇంకొంచెం పెద్ద హోటల్ అయితే ఆ రేట్ మరింత పెరిగిపోతుంది. అదే థాయిలాండ్, వియత్నం లాంటి దేశాల్లో ఇలాంటి బీచ్‌లూ ఇలాంటి వాతావరణమే ఉంటుందిపైగా రెండు నుంచి మూడు వేలకే మంచి హోటల్ రూమ్స్ లభిస్తున్నాయి. 


ప్లానింగ్ లేని అభివృద్ధి 
టూరిస్టులు వస్తున్నారు కదా అని బీచ్‌ల్లో వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్న స్థానిక ప్రభుత్వం రోడ్ల డెవలప్మెంట్ మాత్రం పక్కన పెట్టేసింది. అందుకే సీజన్‌లో వస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని బీచ్‌లు ఓవర్ క్రౌడెడ్ అయితే కొన్ని బీచుల్లో జనాలే ఉండరు. ఎడాపెడా పెరిగిపోతున్న రెస్టారెంట్‌లు, స్ట్రీట్ ఫుడ్స్, గేమింగ్ జోన్ల అభివృద్ధి పేరుతో గోవాలోని నాచురల్ అందాలను నాశనం చేస్తున్నారన్న మరో ఆరోపణ కూడా పర్యావరణవేత్తల నుంచి వినపడుతోంది. 


పెరిగిన క్రైమ్ రేట్ 
న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లిన తాడేపల్లిగూడెం యువకుణ్ని ఫుడ్ విషయంలో వచ్చిన గొడవలో రెస్టారెంట్ కుర్రాళ్ళు చంపేశారు. గత నెలలో ఇది మూడో హత్య అని చెబుతున్నారు. గోవాలో డ్రగ్స్ ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా టూరిస్టులపై దాడి చేయడం అనేది లేదు. అది మొత్తం టూరిజంపైనే దెబ్బ పడుతుందని అక్కడి స్థానికులకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ హద్దులన్నీ చెరిగిపోతున్నాయి. గోవా టూరిజం స్థానికులకు 25-30 శాతం ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇలాంటి ఘటనల వల్ల టూరిస్టుల్లో భయాలు మొదలై వెళ్లడం ఆపేస్తే గోవా ప్రజల జీవనోపాధిపై పెద్ద ప్రభావమే ప్రమాదం ఉందని అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అంతా బాగానే ఉంది అంటున్న ప్రభుత్వం... కానీ 
అయితే గోవా ప్రభుత్వం మాత్రం అంతా బాగానే ఉంది అని చెప్పుకొస్తోంది. కానీ గోవాలోని హోటల్ అసోసియేషన్లు ఈ సీజన్లో టురిస్టుల సంఖ్యలో పెద్ద డ్రాప్ ఉన్నట్టు చెబుతున్నాయి. దానికి నిదర్శనంగా గోవలో ఖాళీగా ఉన్న బీచ్‌ల వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోవా ప్రభుత్వం మేలుకొని టూరిస్ట్‌లను తిరిగి ఆకర్షించేలా సరైన చర్యలు తీసుకోకపోతేగోవా టూరిజం అనేది ఇక గతంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని టూరిజం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.