మహిళా రైతులతో రాహుల్ ముచ్చట్లు..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నుంచి క్యాంపెయినింగ్ స్టైల్ మార్చేశారు. అంతకు ముందు ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపించిన ఆయన...ఈ యాత్రతో అందరికీ చేరువయ్యారు. పార్టీ గెలుపోటముల గురించి పక్కన పెడితే క్యాడర్‌కి కొత్త జోష్ ఇచ్చింది ఈ ప్రచారం. కార్మికులు, రైతులు, కూలీలతో మాట్లాడుతూ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు రాహుల్. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా దాదాపు అన్ని చోట్లా కనిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీకి కొత్త ఉత్సాహం ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హరియాణాలోని సోనిపట్‌లో మహిళా రైతులను కలిశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వారితో చాలా సరదాగా గడిపారు. వాళ్ల కష్టాలేంటో అడిగి తెలుసుకున్నారు. మహిళా సాధికారతతో పాటు GST గురించి మహిళా రైతులతో మాట్లాడారు. ఢిల్లీలోని ప్రియాంక గాంధీకి ఇంటికి వాళ్లకు ఆహ్వానం అందించారు. ప్రత్యేకంగా ఓ వాహనంలో వాళ్లను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆ మహిళా రైతులకు భోజనం పెట్టారు. "ప్రభుత్వం నా ఇల్లుని లాక్కుంది. అందుకే ఇక్కడికి పిలిచాను" అని వాళ్లకు చెప్పారు రాహుల్ గాంధీ. ఆ మహిళలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో చాలా సరదాగా గడిపారు. వాళ్ల పిల్లలతో రాహుల్ మాట్లాడారు. మహిళలు ఎప్పుడూ వెనకబడి ఉండకూడదని, ఓ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడాలని సలహా ఇచ్చారు.
సోనియా గాంధీతో మాట్లాడిన ఓ మహిళ ఓ సరదా ప్రశ్న వేసింది. "రాహుల్‌కి పెళ్లి చేయొచ్చుగా" అని అడిగింది. అందుకు సోనియా గాంధీ తడుముకోకుండా "అమ్మాయిని చూసి పెట్టొచ్చు కదా" అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇది వినగానే అందరూ గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జులై 16 న ఈ రైతులు ప్రియాంక గాంధీ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని రాహుల్ గాంధీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
"నాకు, అమ్మకి, ప్రియాంకకి ఇది మర్చిపోలేని రోజు. మా ఇంటికి చాలా ప్రత్యేకమైన అతిథులు వచ్చారు. సోనిపట్ మహిళా రైతులు మాతో కలిసి డిన్నర్ చేశారు. సరదాగా గడిపారు. మాకు ఎన్నో విలువైన కానుకలూ ఇచ్చారు. నెయ్యి, లస్సీ, ఇంట్లో చేసిన పచ్చళ్లతో పాటు ప్రేమనీ అందించారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత