Export Ban On De-Oiled Rice Bran: మన దేశం నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం (Ban On Non Basmati Rice Exports) విధించిన కేంద్ర ప్రభుత్వం, బియ్యం విభాగానికి సంబంధించిన మరో ఉత్పత్తి పైనా అదే నిర్ణయం తీసుకుంది.


నూనె తీసిన బియ్యం ఊక ‍‌(De Oiled Rice Bran లేదా DORB) ఎగుమతులను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది నవంబర్ 30 వరకు 'ఎక్స్‌పోర్ట్ బ్యాన్‌' అమల్లో ఉంటుంది. DORB ఎగుమతులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) శుక్రవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


డీ ఆయిల్డ్‌ రైస్‌ బ్రాన్‌ అంటే ఏంటి, ఎందుకు పనికొస్తుంది?
డీ ఆయిల్డ్ రైస్ బ్రాన్ అంటే, బియ్యం ఊక నుంచి నూనెను తీసినప్పుడు మిగిలే పదార్థం. దీని రేటు చాలా తక్కువ. ఇది ఒక ఆహార పదార్థం. అయితే, మనుషులు తినరు. పశువుల మేత, కోళ్ల మేత, చేపల మేతలో దీనిని కలిపి వాడతారు. నూనె తీసిన తర్వాత మిగిలే పదార్థం కాబట్టి, ఇది పూర్తి పొడిగా ఉంటుంది. అంతేకాదు, మద్యం ఉత్పత్తిలోనూ ముడి పదార్థంగా దీనిని ఉపయోగిస్తారు. వైద్య పరంగానూ DORB పనికొస్తుంది. కొలెస్ట్రాల్, గుండె సంబంధ వ్యాధులు, ఊబకాయం, అధిక రక్తపోటు (హై బీపీ) వంటి కొన్ని రకాల వ్యాధుల ట్రీట్స్‌మెంట్స్‌లో ఉపయోగిస్తారు.


ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతి దేశం
డీ ఆయిల్డ్ రైస్ బ్రాన్‌ను ప్రపంచంలో ఎక్కువగా ఎక్స్‌పోర్ట్‌ చేసేది మన దేశమే. భారతదేశం, ఏటా 10 లక్షల టన్నులకు పైగా 'నూనె తీసిన బియ్యం ఊక'ను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ మార్కెట్‌లో పెద్ద తలకాయ మనదే కాబట్టి, ఇండియన్‌ గవర్నమెంట్‌ తీసుకున్న నిర్ణయం యావత్ ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. 


ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
ఇంపార్టెంట్‌ పాయింట్‌ ఇదే. మన దేశంలో గత కొన్ని నెలలుగా పాలు, పాల ఉత్పత్తుల రేట్లు పీక్‌ స్టేజ్‌కు వెళ్లాయి. పశువుల మేత (Rice Bran Price) ధరలు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. జంతువుల ఆహారంలో ఇది 25 శాతం వరకు ఉంటుంది. కాబట్టి, పశుగ్రాసం ధరలకు కళ్లెం వేస్తే పాల ధరలు దిగి వస్తాయి. అందుకే, నూనె తీసిన బియ్యం ఊక ఎగుమతిని నిషేధించింది. 


బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం
ఇంతకు ముందు, జులై 20, 2023న, బాస్మతీయేతర బియ్యం విషయంలోనూ భారత ప్రభుత్వం బిగ్‌ డెసిషన్‌ తీసుకుంది, వాటి ఎగుమతిని నిషేధించింది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి నెలకొనే అవకాశం ఉంది. దీంతో కొన్ని నెలలుగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి, గత నెల రోజుల్లోనే 20 శాతం పెరిగాయి. సామాన్య ప్రజలకు రైస్‌ రేట్లు భారమయ్యాయి. మన దేశం నుంచి ఎక్స్‌పోర్ట్‌ అవుతున్న బియ్యంలో 25 శాతం తెలుపు బాస్మతీయేతర బియ్యమే. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో, ప్రజల్లో అసంతృప్తి చెలరేగకుండా మోదీ గవర్నమెంటు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బాస్మతీయేతర బియ్యం రకాలను విదేశాలకు ఎగుమతి చేయకుండా నిషేధించింది. దీనివల్ల లోకల్‌ మార్కెట్‌లో రైస్‌ సప్లై పెరుగుతుంది, రేట్లు దిగి వస్తాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగానూ బియ్యం ఉత్పత్తి తగ్గింది. 


మరో ఆసక్తికర కథనం: ఆగస్టులో బ్యాంకులు 14 రోజులు పని చేయవు, ఈ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial