న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఓటు చోరీ జరిగిందని గురువారం (సెప్టెంబర్ 18, 2025) మరోసారి ఆరోపించారు. ఓటర్ల జాబితాల నుండి 'కాంగ్రెస్ మద్దతుదారుల' పేర్లను సీఈసీ తొలగించిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవారిని, ఓటు దొంగలను ప్రధాన ఎన్నికల అధికారి (CEC) జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జెన్ జెడ్ రాజ్యాంగాన్ని కాపాడుతుంది
రాహుల్ గాంధీ సాయంత్రం ఎక్స్ (X) లో ఒక పోస్ట్ పెట్టారు. దేశంలోని యువత, Gen-Z ఉద్యమం రాజ్యాంగాన్ని కాపాడుతాయని అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో, "దేశంలోని యువత, విద్యార్థులు, Gen Z రాజ్యాంగాన్ని కాపాడుతారని భావిస్తున్నాను. వారు కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారు. ఓటు చోరీని వారే అడ్డుకుంటారు. వారికి నా సపోర్ట్ ఉంటుంది. ఎల్లప్పుడూ వారితోనే ఉంటాను. జై హింద్!" అని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో జెన్ జెడ్ యువత ఆందోళన చేపట్టడంతో ఏకంగా నేపాల్ ప్రధాని రాజీనామా చేశారని తెలిసిందే. అనంతరం కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టారు. భారత్ లో ఓటు చోరీని అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది జెన్ జెడ్ యువతే అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.
అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్'లో మీడియాతో మాట్లాడారు. ప్రధాన ఎన్నికల అధికారి సాకులు చెప్పడం మాని కర్ణాటక CIDకి ఓటు చోరీకి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని కోరారు. ఇతర రాష్ట్రాల ఫోన్లను ఉపయోగించి అలంద్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఆగంతకులు 6,018 ఓట్లను తొలగిస్తే, మహారాష్ట్రలోని రజోరాలోనూ 6,850 మంది కొత్త ఓటర్లను చేర్చారని తెలిపారు. ఇలా చేసిందెవరో ఈసీకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదన్నారు రాహుల్. ఆయన చేసిన ఆరోపణలనుఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొంది.
బీజేపీ నేతల రియాక్షన్
అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలపై పదేపదే చేస్తున్న ఆరోపణలు భారత ప్రజాస్వామ్యంపై ఆయనకు, కాంగ్రెస్‌కు నమ్మకం లేదని చూపిస్తున్నాయని, చొరబాటుదారులను రక్షించే రాజకీయాలు చేస్తున్నారని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలను 'తప్పుడు కథనం' అని కొట్టిపారేశారు. 'అతను గతంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించారు, మేము షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్‌ను రద్దు చేయాలనుకుంటున్నామని ఆరోపించారు, కానీ అలాంటిదేమీ జరగలేదు' అని అన్నారు.
రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన అనురాగ్ ఠాకూర్..
బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతుల (OBC) ప్రయోజనాల గురించి మాట్లాడవచ్చు, అయితే ఎన్నికల సంఘం (EC) నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సమీక్షను వ్యతిరేకించడం ద్వారా చట్టవిరుద్ధమైన ఓటర్లను రక్షించడానికి ప్రయత్నించడం ఈ వర్గాల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని అన్నారు.
రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
కర్ణాటకలోని అల్లాండ్ నియోజకవర్గ గణాంకాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను క్రమంగా తొలగించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనిపై ఈసీ కమిషన్ స్పందిస్తూ, 'రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. రాహుల్ గాంధీ భావించినట్లుగా, ఎవరి ఓట్లను ఆన్‌లైన్‌లో తాము తొలగించలేదు' అని తెలిపింది.