Gaganyaan Mission: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ప్రణాళికబద్ధంగా కొనసాగుతున్న సమయంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సమాంతరంగా మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించి విజయవంతంగా ఒక్కో దశ పూర్తి చేస్తూ వస్తోంది. ఇవాళ చంద్రయాన్-3 ని భూగురుత్వాకర్షణ పరిధి దాటించి చంద్రుడి వైపు మళ్లించిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 30వ తేదీన పీఎస్ఎల్వీ సీ56 ప్రాజెక్టు చేపట్టేందుకు కూడా ఇస్రో సన్నద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఇస్రో చారిత్రాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన సన్నద్ధమవుతున్న మరో ప్రాజెక్టే గగన్‌యాన్. ముగ్గురు వ్యోమగాములు 400 కి.మీ కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. మూడ్రోజుల తర్వాత వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడమే గగన్‌యాన్ ప్రాజెక్టు ఉద్దేశం.
ఈ మిషన్ ద్వారా భారత దేశ మానవ సహిత అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తాజాగా.. ఇస్రో కీలక ముందడుగు వేసింది. రెండో దశ రికవరీ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించింది. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ లో జులై 20 నుంచి మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టులో రికవరీ ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఒక్కో దశను పూర్తి చేస్తున్న ఇస్రో
మొదటి దశలో అత్యవసర సమయంలో వ్యోమగాములను కాపాడే వ్యవస్థకు సంబంధించిన ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ పరీక్షను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా దీనిని గతేడాది నిర్వహించారు. తాజాగా.. రెండో దశ రికవరీ ట్రయల్స్ లో మాస్ అండ్ షేప్ సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ మోకప్ (CMRM) నిర్వహించారు. ఇది టెస్టింగ్ ప్రక్రియలో ఒక కీలకమైన భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. CMRM వ్యోమగాముల దగ్గరకు సకాలంలో చేరుకోవడం, రికవరీ విధానాలు.. నిజ జీవిత పరిస్థితులను కచ్చితంగా అనుకిరంచేలా ఈ ట్రయల్స్ ఉంటాయి. దాని వల్ల గగన్‌యాన్ మిషన్ విజయానికి విలువైన మరింత కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
కొచ్చిలో మొదటి దశ రికవరీ ట్రయల్స్
ఈ ట్రయల్స్ లో వ్యోమగాముల రికవరీ అనుకరణతో పాటు వివిధ దశలు ఉంటాయి. రికవరీ బోయ్ అటాచ్‌మెంట్, టోయింగ్, హ్యాండ్లింగ్, క్రూ మాడ్యూల్ ను షిప్ డెక్ పైకి ఎత్తడటం వంటివి ఉంటాయి. ఈ విధానాలను ముందుగా నిర్ణయించిన రికవరీ సీక్వెన్స్ ప్రకారం అమలు చేస్తూ వస్తారు. కొచ్చిలోని వాటర్ సర్వైవల్ ట్రైనింగ్ ఫెసిలిటీలో నిర్వహించిన మొదటి దశ రికవరీ ట్రయల్స్ నుంచి తప్పొప్పులను గ్రహించి ప్రస్తుత రికవరీ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు.
మిషన్ గగన్‌యాన్ ఎలా సాగుతుందంటే..
భూమికి 400 కిలోమీటర్ల కక్ష్యలో మొదట వ్యోమగాములను ప్రవేశపెడతారు. మూడ్రోజుల తర్వాత వారిని భూమికి తీసుకొస్తారు. తిరిగొచ్చే సమయంలో వ్యోమగాములు సముద్ర జలాల్లో పారాచూట్ల సాయంతో ల్యాండ్ అవుతారు. ఈ వ్యోమగాములను వేగంగా పికప్ చేస్తారు. ఇందుకోసం కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని నౌకాదళానికి చెందిన సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగకుండా, ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగేలా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. గగన్‌యాన్ మిషన్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండే అవకాశాలున్నాయి.