చంద్రయాన్-3 (Chandrayaan-3) చంద్రుడి వైపు వడి వడిగా అడుగులు వేస్తోంది. తన లక్ష్యం దిశగా మంగళవారం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన చంద్రయాన్ అయిదో సారి కక్ష్య పెంపును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం విజయవంతంగా పూర్తి చేసింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)’ నుంచి ఈ కక్ష్య పెంపు జరిగింది. దీంతో చంద్రయాన్ ఇప్పుడు 127609 కి.మీ x 236 కి.మీ దూరంలోని కక్ష్యలోకి చేరుకునే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది. భూమి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య. దీని తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియను ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.
జులై 14వ తేదీన ప్రయోగం చేపట్టగా.. జులై 15వ తేదీన మొదటి కక్ష్యలోకి చేరుకుంది. జులై 16వ తేదీన రెండో కక్ష్యలోకి ప్రవేశించింది. జులై 18వ తేదీన మూడోది, జులై 20వ తేదీన 4వ కక్ష్యలోకి ప్రవేశించి భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది చంద్రయాన్-3. ఒక్కో కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో ఇంజిన్ ను కాస్తంత ఎక్కువగా మండించి క్రమంగా భూమి నుంచి దూరం జరుగుతూ వస్తోంది. ఈ చివరాఖరి ఐదో కక్ష్యలో పరిభ్రమించిన తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ ఇంజిన్ ను మండించి, వేగాన్ని పెంచి.. భూగురుత్వాకర్షణ పరిధి నుంచి చంద్రుని గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశింపజేస్తారు. ఆ తర్వాత చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ.. క్రమంగా కక్ష్యలు మార్చుకుంటూ చంద్రుడికి చేరువగా వెళ్తోంది. చంద్రయాన్-3. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన తర్వాత అసలు పరీక్ష ప్రారంభమవుతుంది. దక్షిణ ధృవ ప్రాంతంలో సాఫ్ట్- ల్యాండింగ్ చేపట్టనున్నారు. అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళికబద్ధంగా జరిగితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గోదేశంగా భారత్ నిలవనుంది. రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ రికార్డులకెక్కనుంది.
ఈ నెల 30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో
భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 30వ తేదీన పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 30వ తేదీన ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో ప్రకటించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్ఏఆర్ ను ప్రయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-ఏఎం, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ఆర్కేడ్, 3యూ నానోశాటిలైట్ స్కూబ్-2, ఐవోటీ కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గలాసియా-2, ఓఆర్బీ-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా ఇస్రో రోదసిలోకి పంపనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial