నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) వివరాల మేరకు 2021లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులపై అత్యధిక నేరాలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. ఎన్‌సీఆర్‌బీ (NCRB) తాజా వివరాల మేరకు 2021లో మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల (SC) సమూహాలకు చెందిన వ్యక్తులపై అత్యధిక నేరాలు జరిగాయి. 2020లో సైతం మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ఎస్సీలపై దాడులు జరిగాయి. 2019లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించింది. ఈ వివరాలు మధ్యప్రదేశ్‌లో దళితులపై పదే పదే జరిగిన అఘాయిత్యాలను ప్రతిబింబిస్తున్నాయి.  


ఇతర రాష్ట్రాల కంటే మధ్యప్రదేశ్‌లో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన రేటు ఎక్కువగా ఉంది. రాష్ట్ర పోలీసులు కులాల పేరుతో జరిగే  నేరాలను నిరోధించలేకపోయినప్పటికీ, కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్ట్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేయడంలో ఇతర రాష్ట్రాల కంటే వాటిని మరింత సమర్థవంతంగా పనిచేశారు. నిందితులను కోర్టుల వరకు తీసుకురాగలిగారు.  ఈ క్రైం రేటును ప్రతి లక్షమంది ఎస్సీల జనాభా ఆధారంగా గణించారు. NCRB నివేదికలు ఇప్పటికీ 2011 సెన్సస్ జనాభా సంఖ్యలను ఉపయోగిస్తున్నాయి. 2021 జనాభా గణనను ప్రభుత్వం నిరవధికంగా ఆలస్యం చేయడంతో కొత్త గణాంకాలతో వివరాలు వెల్లడించడం లేదు. 2021 జనాభ లెక్కల ప్రకారం 2021 క్రైం వివరాలను గణిస్తే నేరాల రేటు మారే అవకాశం ఉంది.   


నేరాలలో SC/ST అట్రాసిటీల నిరోధక చట్టం కింద నమోదైనవి మాత్రమే కాకుండా SCలకు వ్యతిరేకంగా జరిగిన అన్ని నేరాలు/దౌర్జన్యాలు ఉంటాయి. వివరాల్లో పెద్దగా మార్పు ఉండదు. ఉదాహరణకు.. 2021లో దేశంలో ఎస్సీలపై 50,900 నేరాలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లో ఈ సంఖ్య 7,214గా ఉంది. ఎస్సీ/ఎస్టీలపై అట్రాసిటీల నిరోధక చట్టం అమలు చేసిన కేసుల సంఖ్య జాతీయ స్థాయిలో 45,610 ఉండగా మధ్యప్రదేశ్‌లో 7,211గా ఉంది. 2021 ఎస్సీలపై దాడి కేసుల్లో క్రైం రేటు జాతీయ సగటు 25.3 నమోదవ్వగా మధ్యప్రదేశ్‌లో నేరాల రేటు 63.6గా నమోదైంది. 2020లో 60.8 ఉండగా 2019లో 46.7గా నమోదైంది. ఎస్సీలపై అఖిల భారత నేరాల రేటు 2020లో 25 ఉండగా 2019లో 22.8గా ఉంది. 2021, 2020లో నేరాల రేటులో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 2019లో క్రైం రేటులో రాజస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.


2019 నుంచి 2021 మధ్య మూడు సంవత్సరాల్లో షెడ్యూల్డ్ తెగల (STలు)పై ఉన్న నేరాల రేటులో కేరళ అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ మూడేళ్లుగా రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 2019లో ఐదవ స్థానంలో, 2020లో నాల్గవ స్థానం, 2021లో మూడవ స్థానంలో ఉంది. నేరాలపై పోలీసులు తీసుకున్న/తీసుకోని చర్యల వివరాలను సైతం ఎన్‌సీఆర్‌బీ వెల్లడిస్తుంది. ఛార్జ్-షీట్ రేట్ల విషయానికి వస్తే ఎస్సీలపై నేరాలకు సంబంధించి కేసుల్లో పోలీసులు పరిష్కరించినవి ఎన్ని?  చార్జ్ షీట్లు దాఖలు చేసిన కేసులు ఎన్నో వెల్లడిస్తుంది. కేసుల పరిష్కారంలో 2021 డేటా ప్రకారం మధ్యప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. సిక్కిం తర్వాత రెండవ స్థానంలో ఉంది. SCలపై నేరాల రేట్‌లో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్  2021లో పేలవమైన ఛార్జ్-షీట్ రేటును చూపింది. 2021లో ఎస్సీలపై నేరాలలో అసోం అత్యల్ప ఛార్జ్-షీట్ రేటును కలిగి ఉంది. STలపై నేరాలకు సంబంధించి ఛార్జ్ షీట్‌లను దాఖలు చేసే విషయంలో కూడా మధ్యప్రదేశ్ మంచి పనితీరు కనబరిచింది.