Meghalaya News: మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలోనే ఒక గుంపు ఆఫీసుపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అయితే ఈ సమయంలో సీఎం సంగ్మా తన కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రస్తుతం ఆయన తన కార్యాలయంలోనే ఇరుక్కుపోయారు. 






తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు కోసం గారోహిల్స్ పౌర సమాజ సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. గత 14 రోజులుగా ఆ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సీఎం సంగ్మా సోమవారం షిల్లాంగ్ నుంచి తురా చేరుకున్నారు. తురాలోని సీఎం కార్యాలయంలో కాన్షియస్ హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్, గారో హిల్స్ స్టేట్ మూవ్ మెంట్ కమిటీ సహా నిరసన పౌర సంస్థలతో చర్చలు జరిపారు. మూడు గంటలకుపైగా సీఎం, వర్గాల మధ్య సమావేశం ప్రశాంతంగా సాగింది. అయితే సీఎంఓ తురా వద్ద గుమిగూడిన గుంపు రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో పరిస్థితి అనూహ్య మలుపు తిరిగింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. అనంతరం జరిగిన తోపులాటలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. తురాలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. సీఎం సంగ్మా, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి కార్యాలయం లోపలే చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా షిల్లాంగ్‌లో ఆగస్టు 8, 9 తేదీలలో చర్చలకు రావాలని సీఎం సంగ్మా పౌర సంఘాలల ప్రతినిధులను ఆహ్వానించారు.