ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గంగా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. హరిద్వార్‌లో ప్రమాదకర స్థాయికి మించి వరద ప్రవహిస్తోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హరిద్వార్‌లో ప్రమాదకర స్థాయి నీటి ప్రవాహం 293 మీటర్లు కాగా సోమవారం రాత్రి 293.25 వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు హరిద్వార్‌లోని గంగానది నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ సబ్ డివిజనల్ అధికారి తెలిపారు. 






గంగా నదిలో నీటి మట్టం పెరిగిందని సోమవారం రాత్రి 9 గంటలకు నీటి మట్టం 293.25 మీటర్లకు నమోదైనట్లు ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖ SDO శివకుమార్ కౌశిక్ తెలిపారు. ఈ వరదతో లోతట్టు ప్రాంతాలు ప్రభావితమవుతాయని, బిజ్నోర్, ముజఫర్‌నగర్ వంటి జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా లేదని, పెద్ద నష్టం ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.  ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. గంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నదీ ప్రవాహానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతానికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. 






ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో పుట్టిన గంగా నది ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల గుండా వెళుతుంది. ఉత్తర కాశీలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గంగా నది ఉగ్రరూపం దాల్చుతోంది. వరద దాటికి రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. గంగా వరద దాటికి సోమవారం, ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని గౌచర్ పట్టణం సమీపంలో 70 మీటర్ల జాతీయ రహదారి దెబ్బతిన్నట్లు చెప్పారు. అలాగే ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఎడతెగని వర్షాలు కురుస్తుండడంతో యమునోత్రి హైవేపై చాలా చోట్ల బండరాళ్లు పడిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పవిత్ర యమునోత్రి తీర్థయాత్రను అధికారులు నిలిపివేశారు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఉత్తరకాశీలో ప్రజల మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి దెబ్బతిన్నట్లు ఒక అధికారి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరకాశీ జిల్లాలోని పురోలా, బార్‌కోట్‌, దుండాలో 50 భవనాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. వరదలతో 50 రోడ్లు మూసుకుపోయాయని, దాదాపు 40 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, 400కు పైగా డ్రెయిన్లు కొట్టుకుపోయాయని ఉత్తరకాశీ డీఎం అభిషేక్‌ రోహిలా తెలిపారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial