పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నాలుగో రోజు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ రోజు కూడా ఉభయ సభల్లో (లోక్ సభ, రాజ్యసభ) గందరగోళం నెలకొంది. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇవాళ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తాము సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అధికార పక్షం ఎదురు దాడి చేసింది. ఇండియా పక్షాలను ఈస్ట్‌ఇండియా కంపెనీతో ప్రధాని మోదీ పోలుస్తూ విమర్శలు చేసారు.
అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, కౌంటర్ ఎన్‌కౌంటర్ కామెంట్స్‌తో ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. ఎన్డీఏ, ఇండియా రెండు పార్టీలు కూడా మణిపూర్ హింసాకాండను అడ్డుపెట్టుకొని ఒకరినొకరు దూషించుకుంటున్నారు. సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి.
విపక్షాల 'ఇండియా' పేరుపై రవిశంకర్ ప్రసాద్ విమర్శలు
బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ప్రతిపక్ష 'ఇండియా' కూటమిని ఇండియన్ ముజాహిదీన్‌తో పోల్చారు. 'ప్రధానిని చూసి గర్విస్తున్నాం. నేడు ఇండియన్ ముజాహిదీన్ కూటమితో రాజకీయాలు చేస్తున్నారు. 2024లో తాము అధికారంలోకి రాలేమని ప్రతిపక్షాలు అంగీకరించాయి.
ప్రభుత్వం చర్చకు సిద్ధమైతే వాయిదా తీర్మానాలు దేనికి?
మణిపూర్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే వాయిదా తీర్మానం పెట్టి ఏం లాభం అని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ప్రశ్నించారు. అదే సమయంలో రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా చర్చించాలని ఎంపీ పీయూష్ గోయల్ అన్నారు.
ఇండియన్ ముజాహిదీన్', 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇండియా ఉంది: మోదీ
విపక్షాలు పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. ప్రధాని 'ఇండియా' కూటమిని బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ, PFI వంటి తీవ్రవాద సంస్థలతో పోల్చారు. నిరసన తెలపడమే ప్రతిపక్షాల పని అని, తమ పార్టీ నేతలు పనిపై దృష్టి పెట్టాలని కోరారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని.. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"...బ్రిటిషర్లు వచ్చి తమకు ఈస్టిండియా కంపెనీ అని పేరు పెట్టుకున్నట్లే, విపక్షం కూడా ఇండియా పేరుతో తమను తాము ప్రదర్శిస్తోంది," అని ప్రధాని ప్రతిపక్షాలను హేళన చేస్తూ అన్నారు. 'ఇండియన్ ముజాహిదీన్', 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)' వంటి తీవ్రవాద సంస్థల్లో కూడా 'ఇండియా' ఉందని ప్రధాని తీవ్ర స్థాయిలో దాడి చేశారు.
మణిపూర్ పై కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న విపక్షాలు
మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాల నేతల పార్లమెంట్ సమావేసాలకు ముందు భేటీ అయ్యారు. మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలని ఉభయ సభల్లో డిమాండ్ చేస్తూనే ఉండాలని నిర్ణయించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతున్న టైంలోనే భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గదిలో సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ప్రధాని స్పందించే వరకు ప్రతిష్టంభన కొనసాగుతుంది: సంజయ్ సింగ్
ప్రధాని స్పందించే వరకు ప్రతిష్టంభన కొనసాగుతుందని, ప్రధాని సమాధానం చెప్పాల్సి ఉంటుందని పార్లమెంట్ హౌస్ ఆవరణలో బైఠాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తనను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణంలో కూర్చొని నిరసన చేపట్టారు. సంజయ్ సింగ్ సస్పెన్షన్ పై రాజ్యసభ ఎంపీ జేబీ మాథేర్ మాట్లాడుతూ.. సంజయ్ సింగ్ ఒక్కరే కాదు, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. మా ఎంపీల్లో ఒకరిని సస్పెండ్ చేయడం ద్వారా బెదిరించవచ్చని అధికార ప్రభుత్వం భావిస్తే... ఇంకా గట్టిగా డిమాండ్ చేస్తాం. ప్రధాని పార్లమెంటుకు వచ్చి మణిపూర్ పై ప్రకటన చేయాలి, ఆ తర్వాత సమగ్రంగా చర్చించాలన్నారు.
ప్రధాని 'బేటీ బచావో' నినాదం ఏమైంది?
మణిపూర్ హింసాకాండపై ప్రధాని సమాధానం చెప్పాలన్నదే తమ డిమాండ్ అన్నారు విపక్ష ఎంపీలు. సోమవారం నుంచి గాంధీ విగ్రహం వద్దే కూర్చొని ఉన్న ఎంపీలు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. మణిపూర్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని గుర్తు చేసారు. పార్లమెంటులో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. 'బేటీ బచావో' అనే ప్రధాని నినాదం ఏమైందని ప్రశ్నించారు.