G20 Summit: అంతరిక్ష రంగంలో విజయవంతంగా ప్రయోగాలు చేపడుతున్న భారత దేశాన్ని జీ20 సదస్సులో ప్రపంచ నేతలు ప్రశంసించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండ్ చేయడంతో పాటు సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత్ ను కొనియాడారు. హాలీవుడ్ సినిమా ఇంటర్‌స్టెల్లార్ నిర్మాణానికి అయిన ఖర్చుతో పోలిస్తే తక్కువ బడ్జెట్ తోనే చంద్రయాన్-3 ప్రాజెక్టును భారత్ చేపట్టిందని గుర్తు చేస్తూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కూడా ఇస్రో సాధిస్తున్న ఘనతలను ప్రశంసించారు. 


చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని తాను వీక్షించానని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తెలిపారు. సింగపూర్, నెదర్లాండ్స్, ఇటలీ ప్రధాన మంత్రులు, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్ పర్సన్ సహా పలు దేశాల నేతలు కూడా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు అభినందనలు తెలిపారు. శనివారం ఆమోదం తెలిపినన జీ20 న్యూఢిల్లీ డిక్లరేషన్ లోనూ చంద్రయాన్-3 ల్యాండింగ్ ను ప్రపంచ దేశాధినేతలు ప్రశంసించారు. చంద్రయాన్-3 కి దాదాపు రూ. 600 కోట్లు వ్యయం కాగా.. ఇంటర్ స్టెల్లార్ సినిమా నిర్మాణానికి రూ.1,400 కోట్ల ఖర్చు అయింది.


మూడోసారి ఆదిత్య-ఎల్1 కక్ష్య పెంపు


ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం మూడో విన్యాసాన్ని శాస్త్రవేత్తలు ఆదివారం విజయవంతంగా పెంచారు. దీని ద్వారా ఉపగ్రహాన్ని 296 x 71,767 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టారు. కక్ష్య పెంపు ప్రక్రియను బెంగళూరులోని ఇస్ట్రాక్ నుంచి విజయవంతంగా చేపట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. మారిషస్, బెంగళూరు, ఎస్డీఎస్సీ షార్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు ఈ ఆపరేషన్ సమయంలో ఉపగ్రహాన్ని ట్రాక్ చేశాయి. తదుపరి కక్ష్య పెంపును ఈ నెల 15వ తేదీన చేపట్టనున్నారు.


L1కి చేరుకున్నాక..?


ఒక్కసారి L1 ఫేజ్‌కి చేరుకున్న తరవాత ఆదిత్య L1 ఇంజిన్‌ల సాయంతో పాథ్ మార్చుతారు. అక్కడి నుంచి క్రమంగా L1 Halo Orbitలోకి ప్రవేశిస్తుంది. ఆ పాయింట్ వద్దే ఇది స్టేబుల్‌గా ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ వద్ద భూమి గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అవడం వల్ల ఆదిత్య L1 అక్కడే స్థిరంగా ఉంటుంది. అయితే...సైంటిస్ట్‌లు చెబుతున్న వివరాల ప్రకారం...అది అక్కడ స్టేబుల్‌గా ఉండకుండా చాలా నెమ్మదిగా కదులుతుంది. అక్కడి నుంచే సూర్యుడికి సంబంధించిన కీలక వివరాలు సేకరిస్తుంది. రోజుకి 14 వందలకు పైగా ఫొటోలు తీసి పంపుతుంది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 3 సక్సెస్‌తో జోష్ మీదున్న ఇస్రో...ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందన్న ధీమాతో ఉంది.