జీ 20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ, సమాజం పాత్ర తదితర అంశాల గురించి మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వెల్లడించారు. జీ20 సదస్సు అనంతరం దిల్లీ నుంచి బైడెన్‌ వియత్నాం వెళ్లారు. అక్కడ దిల్లీలో జరిగిన చర్చల గురించి విలేకరులు ప్రశ్నించగా బైడెన్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై తాను, మోదీ ముఖ్యంగా చర్చించినట్లు పేర్కొన్నారు. 'నేను ఎప్పటిలాగే మానవ హక్కులను గౌరవించడం ప్రాముఖ్యతను, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడంలో పౌర సమాజం, పత్రికా స్వేచ్ఛ కీలకం' అని మోదీతో చర్చల్లో తెలియజేశాను అని బైడెన్‌ అన్నారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం పట్ల, మోదీ నాయకత్వం పట్ల బైడెన్‌ ధన్యవాదాలు తెలిపారు. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారిగా భారత్‌ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.


స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అందరికీ సమాన అవకాశాలు వంటి భాగస్వామయ్య విలువలు ఇరు దేశాలకు ప్రయోజనకరమని ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించినట్లు  ప్రకటన ద్వారా వెల్లడించారు. బైడెన్‌, ప్రధాని మోదీతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యంపై మాట్లాడారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పెంచడం, వైవిధ్యపరచడంతో పాటు భారత్‌కు డ్రోన్లు అందజేయడం, సంయుక్తంగా జెట్‌ ఇంజిన్ల అభివృద్ధిపై బైడెన్‌ హామీ ఇచ్చారు. సవాళ్లను పరిష్కరించడంలో, గ్లోబల్‌ పార్టనర్‌షిప్ విషయంలో అమెరికా నిబద్ధతను చాటుకోవడానికి ఈ సదస్సు చాలా ముఖ్యమైనదిగా నిలిచిందని బైడెన్‌ అభిప్రాయపడ్డారు. సమ్మిళిత, సుస్థిరమైన అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం, వాతావరణ సంక్షోభాలను పరిష్కరించడం, ఆహార భద్రత, విద్యను బలోపేతం చేయడం, ప్రపంచ ఆరోగ్యం, ఆరోగ్య భద్రతను వృద్ధి చేయడం తమ ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు.


భవిష్యత్తు భాగస్వామ్యం అంశంలో అమెరికా సానుకూల దృక్పథంతో ఉంటుందని ప్రపంచానికి తెలియజేస్తున్నామని బైడెన్‌ అన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం గురించి కూడా చర్చల్లో మాట్లాడామని, న్యాయపరమైన శాశ్వత శాంతి ఆవశ్యకతపై తగిన ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. వియత్నాం, ఆసియా దేశాలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో సంబంధాలను బలపరచుకోవాలనుకున్నట్లు చెప్పారు. అలాగే చైనాతో కోల్డ్‌ వార్‌ ప్రారంభించాలని తాను అనుకోవట్లేదని అన్నారు. జీ20 సమావేశాల్లో భాగంగా చైనా ప్రధాని లీ కియాంగ్‌తో చర్చలు జరిపానని, స్థిరత్వం గురించి మాట్లాడానని అయితే ఇది ఘర్షణ తరహాలో కాదని స్పష్టంచేశారు. మిడిల్‌ ఈస్ట్‌, ఇజ్రాయిల్‌, భారత్‌తో అనుసంధానించే కారిడార్‌ గురించి అడిగిన ప్రశ్నలపైనా బైడెన్‌ స్పందించారు. దీని వల్ల ఎన్నో అవకాశాలు వస్తాయని, ఆర్థిక పెట్టుబడుకు ఎంతో మంచి అవకాశం అని చెప్పారు. 


మోదీతో చర్చల అనంతరం బైడెన్‌ మోదీని అమెరికా అధ్యక్ష నివాసానికి ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోదీ శుక్రవారం వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వైట్‌ హౌస్‌కు ఆహ్వానించడం ఆనందంగా ఉందని తెలిపారు. బైడెన్‌ అధ్యక్షుడు అయిన తర్వాత మోదీ  ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటకు వెళ్లి వచ్చారు.