స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్‌కు వెళ్ళిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ టిడిపి బంద్‌కు పిలుపు‌ నిచ్చింది. ఆందోళనలు నిలువరించేందుకు రాష్ట్రంవ్యాప్తంగా ప్రభుత్వం 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చింది. ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తుగా టిడిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేయగా, మరికొందరు నిరసన వ్యక్తం చేసేందుకు రోడ్డుపైకి వచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్స్ కు తరలించారు.. 


మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేస్తూ తన ఇంటి చుట్టూ బ్యారికేడ్లు పెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈరోజు తన ఇంటికి వచ్చిన పోలీసులతో ఆయన గొడవ పడ్డారు. హౌస్ అరెస్టు నోటీస్‌ను తిరస్కరించారు. 


మూడు రోజులుగా మాగుంట లేఔట్‌లో బారికేడ్లతో రాకపోకలను నిలిపివేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫైర్‌ అయ్యారు కోటంరెడ్డి. తనను అరెస్ట్ చేయాలని, తానే స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్‌కి వస్తానని, తనను లాకప్‌లో పెట్టాలని అన్నారు. కనీసం పని వారిని కూడా తన ఇంట్లోకి రానివ్వడంలేదని, ఇదెక్కడి అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మాజీ మంత్రి పరిటాల సునీతను తెల్లవారుజామున నాలుగు గంటలకే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వెంకటరాపురంలో పరిటాల సునీత ఇంటిని చుట్టుముట్టి ఎవర్నీ బయటకు రానీయలేదు. బయటవారిని కూడా లోపలికి పంపించడం లేదు. పోలీసుల కళ్లు గప్పి నిర్బంధాన్ని దాటుకొని పరిటాల సునీత బయటకు వచ్చారు. పోలీసులు అడ్డుకుంటున్నా ముందుకు వెళ్తేందుకు యత్నించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పరిటాల సునీత నిరసన ప్రదర్శన చేశారు. 


చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ రోజు ఆర్టీసీ బస్సు డిపో‌ నుంచి బయటకు రావడంతో ఆగ్రహించి‌ టిడిపి శ్రేణులు బస్సు అద్దాలు పగలకొట్టారు. దీంతో పోలీసులకు, టిడిపి శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. టిడిపి శ్రేణులను అరెస్టు చేసేందుకు పోలీసులు రావడంతో నడి రోడ్డుపై పడుకొని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ నిరసన వ్యక్తం చేశారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.


శ్రీ సత్య సాయి జిల్లా  హిందూపురంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. పట్టణం శ్రీకంఠపురం వద్ద టిడిపి శ్రేణులు, ఆందోళనకారులు ఆర్టీసీ బస్‌కు గాలి తీసివేశారు. షాపులు, హోటళ్లు మూయించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న టైంలో ఆందోళనలకు అనుమతి లేదంటూ నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు పోలీసులు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం స్వచ్ఛందంగా బందులో పాల్గొంది. కళ్యాణదుర్గంలో అర్టీసి బస్సులను ఆపేసి రోడ్డుపై బైఠాయించారు టిడిపి ఇన్ చార్జ్ ఉమామహేశ్వర నాయుడు. ఆయన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు చేసేందుకు ఆయన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 


ఉండవల్లిలో టీడీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టి బొమ్మ తగలబెట్టేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. నాయకులను అరెస్టు చేసి తరలిస్తుంటే... పోలీస్ వాహనానికి మహిళలు అడ్డంగా పడుకున్నారు. ఈ తోపులాటలో ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి. 


చంద్రబాబునాయుడు అరెస్ట్ ఖండిస్తూ గుంటూరుసో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద టీడీపీ ఇంచార్జ్ నజీర్ బయటకు వచ్చిన బస్సులను ఆర్టీసీ డిపోలోకి పంపించారు. డిపోలోని డ్రైవర్లు మొత్తాన్ని బయటికి రావాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా ప్రయాణికులు వెళ్లిపోయారు.