చంద్రబాబుని రిమాండ్ కి తరలించిన తర్వాత నారా లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు పవన్ కల్యాణ్. ఫోన్ లో ఆయన్ను పరామర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలన్నారు. జగన్ నియంత పాలనపై కలసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు టీడీపీ బంద్ కి కూడా జనసేన మద్దతు ఇచ్చిన విషయాన్ని తెలియజేశారు పవన్. జనసేన శ్రేణులు బంద్ కి సహకరించాలని పవన్ ఇదివరకే చెప్పారు. బంద్ కి మద్దతు తెలిపే విషయంలో బీజేపీ సైలెంట్ గా ఉన్నా కూడా పవన్ మాత్రం టీడీపీతో కలసి పోరాటం చేసేందుకే సిద్ధమయ్యారు. అదే విషయాన్ని లోకేష్ కి కూడా క్లారిటీగా చెప్పారు పవన్. 


చంద్రబాబు అరెస్ట్ కి ముందు, అరెస్ట్ తర్వాత అన్నట్టుగా ఏపీలో పరిస్థితులు మారిపోయాయని టీడీపీ నేతలంటున్నారు. చంద్రబాబుపై ప్రజల్లో సింపతీ పెరిగిందని అంటున్నారు. అదే సమయంలో జనసేన నుంచి కూడా వారికి ఊహించని స్థాయిలో మద్దతు లభించింది. నేరుగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రావడం, ఆయన్ను అడ్డుకోవాలని పోలీసులు చూసినా కూడా వారిని ఎదిరించి రావడం టీడీపీకి ఊరటనిచ్చింది. తమ అధినేత కోసం పవన్ అంత సాహసం చేశారనే ఆలోచన కూడా వారిలో ఉంది. అటు జనసైనికులకు కూడా చంద్రబాబు అరెస్ట్ తో జగన్ వ్యూహం తెలిసొచ్చింది. పవన్ ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఏపీలో పరిస్థితులపై ఓ అవగాహన వచ్చింది. పవన్ ఒంటరిగా పోరాటం చేయడం కంటే, టీడీపీతో కలసి వైసీపీని ఎదుర్కోవడం మేలని జనసైనికులు డిసైడ్ అయ్యారు. టీడీపీకి మద్దతుగా జిల్లాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ పై విమర్శలు సంధించారు. నిరసనలు, ధర్నాల్లో కలసి పాల్గొన్నారు. ఈరోజు బంద్ లో కూడా టీడీపీతోపాటు జనసేన నాయకులు కలసి పాల్గొంటారు. 


పొత్తు పొడిచినట్టే..
పొత్తుల విషయంలో కూడా పవన్ కల్యాణ్ మరోసారి జనసైనికులకు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో తమ బలం పెరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూనే, అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ తీసుకునే అవకాశం లేదని అంటున్నారు పవన్ కల్యాణ్. చంద్రబాబుకి తన మద్దతు ఇప్పుడూ, ఆ తర్వాత కూడా ఉంటుందని స్పష్టం చేశారు. తాను 10సార్లు మాట మార్చేవాడిని కాదంటున్నారు పవన్. రాష్ట్రంలో జనసేన బలం, ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కోరకంగా పెరిగిందని చెప్పారు పవన్. అయితే వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ తీసుకోబోనని ఆయన ప్రకటించడం విశేషం. అంటే సీట్ల విషయంలో పట్టుదలకు పోలేనంటూ క్లారిటీ ఇచ్చారు పవన్. దాదాపుగా టీడీపీతో పొత్తుపై ఆయన విస్పష్ట ప్రకటన చేసినట్టే లెక్క. 


జనసేన విషయంలో నారా లోకేష్ స్పందించలేదు. జనసేన మద్దతుపై కూడా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేష్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. తన రక్తం మరిగిపోతోందని, తాను కూడా పోరాట యోధుడినేనని ఆయన చెప్పారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడతానన్నారు. అయితే ఎక్కడా జనసేన సపోర్ట్ గురించి ఆయన ప్రస్తావించలేదు, పవన్ మద్దతుకు కృతజ్ఞత తెలపలేదు. ఈరోజు పవన్ కల్యాణ్ ఫోన్ కాల్ పై లోకేష్ అధికారికంగా స్పందించే అవకాశముంది. ఈరోజు పవన్, లోకేష్ భేటీపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి చంద్రబాబుని పవన్ ముందే పరామర్శించి ఉండాల్సింది కానీ, ఏపీ పోలీసుల ఆంక్షలతో అది కుదరలేదు. ఈరోజు పవన్, లోకేష్ భేటీపై ఊహాగానాలు మొదలయ్యాయి.