Kodali Nani: చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై ఆయన స్పందిస్తూ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నేడు అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజు అని తెలిపారు. ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయని అన్నారు. లక్షల మంది పిల్లల సొమ్మును చంద్రబాబు పందికొక్కులా దోచుకుని ఉత్త పుత్రుడు లోకేష్‌కు దారాదత్తం చేశారని విమర్శించారు. 


లోకేష్.. రెడ్ బుక్‌లో రాసుకో 
బాబు తనలోని దొంగ స్కిల్స్ అన్నీ ఉపయోగించి స్కిల్ డెవలప్మెంట్ సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబును జైలు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకోవాలని కొడాలి నాని ఎద్దేవా చేశారు. సాక్ష్యాలతో సహా చంద్రబాబుని పట్టుకున్న, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానిగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నా అన్నారు. 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టారని, సీఎం పదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఒక అనాథలా కుటుంబానికి దూరం చేసిన 420 చంద్రబాబు అన్నారు. 


ఎంగిలి మెతుకులకు ఆశపడి..
అప్పుడే ఎన్టీఆర్ చెప్పారని, తనను వెన్నుపోటు పొడిచి రాష్ట్ర సంపదను దోచుకోవడానికి యత్నించిన చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారని అన్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నాడు తండ్రిని క్షోభ పెట్టిన చంద్రబాబు కాళ్ల వద్దకు చేరారని విమర్శించారు. దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరని, చంద్రబాబు విషయంలో అది నిరూపితమైందన్నారు. ఎన్నికల వేళ సింపతి వస్తుందని కూడా ఆలోచించకుండా అవినీతిపరుడు చంద్రబాబుపై, సీఎం జగన్ దర్యాప్తు చేయించడం అభినందనీయమన్నారు. అవినీతి ఎవరు చేసిన ఉక్కు పాదంతో అణిచివేస్తానని జగన్ నిరూపించారని కొనియాడారు. 


2018లోనే స్కాం జరిగిందని, పేద విద్యార్థల సొమ్మును చంద్రబాబు కాజేశారని కొడాలి నాని విమర్శించారు. విచారణకు అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకోకపోతే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అవినీతి చక్రవర్తి, 420 చంద్రబాబును చిప్పకూడు తినే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తానే పెద్ద తోపు, తురుము, 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబును జగన్ ఉక్కుపాదాలతో అణచి వేశారని అన్నారు. రిమాండ్ షీట్‌లో లోకేష్ పేరు ఉందని, ఆయన్ను కూడా త్వరలోనే అధికారులు అరెస్ట్  చేస్తారని చెప్పారు.


వీసా అవసరం లేదు.. ప్యాకేజీ ఉంటే చాలు
పవన్ కళ్యాణ్ ఆంధ్రకు రావాలంటే వీసా అవసరం లేదని, ప్యాకేజీ ఉంటే చాలని కొడాలి నాని విమర్శలు చేశారు. ఉత్త పుత్రుడు కష్టపడుతుంటే తాను వెనకబడిపోతాననే భయంతో దత్త పుత్రుడు హడావిడిగా అమరావతి బయలుదేరాడని విమర్శించారు. కావాలనే అర్ధరాత్రి పవన్ రోడ్లపరై హైడ్రామా చేశారని మండిపడ్డారు. రోడ్డుపై దేక్కుంటూ అయినా సరే చంద్రబాబు కాళ్ల వద్దకు రావాలన్నదే పవన్ తాపత్రయమని ఎద్దేవా చేశారు. పవన్ లీగల్‌గా చంద్రబాబుకు దత్తత వెళ్లి, కుటుంబ సభ్యుడిగా కోర్టుకు వెళ్లి కలుసుకుంటే బాగుండేదని విమర్శించారు.