Dharmana Prasada Rao: ద‌ర్యాప్తు సంస్థల‌కు స‌హ‌క‌రించి చంద్రబాబు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని రెవెన్యూ శాఖా మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు సవాల్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ద‌ర్యాప్తు సంస్థలను చంద్రబాబు న‌మ్మడం లేదని, ఆయన్ను తాము నమ్మడం లేదన్నారు. స‌భ్య స‌మాజాన్ని రెచ్చగొట్టే చ‌ర్యల‌ను మానుకోవాలని హితవు పలికారు. ప్రజాధ‌నం దుర్వినియోగం అయింది అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నిక‌ల్లో మైలేజీ వ‌స్తుంద‌ని అనుకోవడం లేదన్నారు. వాస్తవాలు  ప్రజ‌లకు తెలియాల్సి ఉందన్నారు. అవి తెలిశాక జ్యుడీషియ‌రీ ముందు ఎవ‌రికి వారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని అన్నారు. అప్పుడే ఎవ‌రి స‌చ్ఛీల‌త ఏంటో తేట‌తెల్లం అవుతుందన్నారు. 


చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయ‌కూడ‌దని ఎవరైనా వాదిస్తే అది ఎంత మాత్రం స‌బ‌బు కాదన్నారు. మ‌న వ్యవ‌స్థలో, మ‌న రాజ్యాంగ వ్యవ‌స్థలో ఫ‌లానా వారికి మిన‌హాయింపు ఉందా? అని ప్రశ్నింంచారు. త‌ప్పనిస‌రిగా అంద‌రూ చ‌ట్టం ముందు జ‌వాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. అందుకే ద‌ర్యాప్తు సంస్థ అరెస్టు చేస్తుందే త‌ప్ప అరెస్టుకు సంబంధించి కార‌ణాల‌ను ముద్దాయితో స‌హా కోర్టు ముందు కూడా ఉంచుతుందన్నారు. అరెస్టు స‌క్రమ‌మా ? అక్రమ‌మా ? కోర్టు నిర్ణయిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో భారీగా ధ‌నం దుర్వినియోగం అయింద‌ని ర‌క‌ర‌కాల సంస్థల నుంచి ఎస్టాబ్లిష్ అయిందన్నారు. 


మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కోర్టు ముందు నిల‌బ‌డ‌లేదా ? అని ధర్మాన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన పీవీ న‌ర‌సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి కోర్టు ముందు నిల‌బ‌డ్డారని అన్నారు. ప‌క్కనే ఉన్న త‌మిళ‌నాడుకు చెందిన జ‌య‌ల‌లిత కోర్టుకు హాజరయ్యారని అన్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోర్టుకు వెళ్లారని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు మిన‌హాయింపు ఉంటుందని ప్రశ్నించారు.  గ‌తంలో ఇలాంటి ప్రభుత్వాల‌ను న‌డిపిన‌టువంటి వ్యక్తులు కూడా అమాయ‌క ప్రజ‌ల‌ను రెచ్చగొట్టి, వారిని ఉసిగొల్పి, ద‌ర్యాప్తు సాగ‌నివ్వకుండా చేయ‌డం సరికాదన్నారు. ద‌ర్యాప్తులో పెట్టిన‌ అంశాలు త‌ప్పు అని నిరూపించుకుంటే చంద్రబాబు నిర్దోషిగా బ‌య‌ట‌పడొచ్చన్నారు. 


ప్రజాధ‌నం దుర్వినియోగం గురించి ద‌ర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ప్రజా జీవితంలో ఉండేవారు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. త‌ప్పించుకోవాల‌ని చూడడం క‌రెక్టు కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయ‌మ‌ని మ‌నం ప్రమాణం చేసి అసెంబ్లీకి వస్తామన్నారు వ‌స్తామని. చంద్రాబాబు అక్రమాలకు పాల్పడ్డారని ద‌ర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని అన్నారు. డబ్బు షెల్ కంపెనీలకు వెళ్లిపోయిందని తేలిందన్నారు. షెల్ కంపెనీల‌కు చేరిన మ‌నీ మ‌ళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబుకు చేరింద‌ని ద‌ర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని అన్నారు. ఇవాళ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ దేశాన్ని విడిచి పారిపోయారని అన్నారు. 


నేను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసేది ఒక్కటేనని అనేక ఆధారాల‌తో ఛార్జిషీటు నమోదైందని, రిమాండ్ రిపోర్టులు రాశారని చంద్రబాబు స్వచ్ఛందంగా ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాలని కోరారు. ద‌ర్యాప్తు జ‌రిగి ప్రజ‌ల ముందు, కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, నిర్దోషిగా బ‌య‌ట‌కు రావాలన్నారు. ఆయన త‌ప్పించుకునేందుకు యత్నిస్తే మ‌చ్చ మిగిలిపోతుందన్నారు. జ్యుడీషియ‌రీలో చంద్రబాబు నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తే ఆయన స‌చ్ఛీల‌త ఏంటో తెలుస్తుందన్నారు. అస‌లు ద‌ర్యాప్తు జ‌ర‌గ‌నివ్వకుండా చేస్తే దోషివ‌న్న సంగ‌తి కోర్టు క‌న్నా ముందు ప్రజ‌లే నిర్ణయిస్తారని అన్నారు. 


ద‌ర్యాప్తు సంస్థను అభినందించాల్సిందే
అనేక విష‌యాలు చూసిన వ్యక్తిగా,ఓ పౌరుడిగా, క్యాబినెట్ మినిస్టర్ గా చెప్పేది ఒక్కటేనని, అనేక మంది పెద్దలు ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారని, శిక్ష అనుభ‌వించారని, మరి కొందరు నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డ్డారని అన్నారు. చంద్రబాబు కూడా సాక్షాధారాలు ద‌ర్యాప్తు చేస్తున్న సంస్థల‌కు స‌హక‌రించి, వారికి కావాల్సిన‌ స‌మాచారం ఇచ్చి తాను ఏ త‌ప్పూ చేయ‌లేదని నిరూపించుకోవాలన్నారు. ప్రజాధ‌నం దుర్వినియోగానికి సంబంధించి ద‌ర్యాప్తు చేప‌డుతున్న ద‌ర్యాప్తు సంస్థను అభినందించాలన్నారు. వారిపై ద‌బాయించ‌డం ఏంటని ప్రశ్నించారు. నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని దోషిగా తేలితే శిక్ష పడుతుందని, నిర్ధోసిగా తేలితే బయటకు వస్తారని అన్నారు.