IND vs PAK: 


వారం రోజులుగా భారత్‌, ఇండియా అనే పదాలు హాట్‌ టాపిక్‌గా మారాయి! అటు రాజకీయంగా ఇటు సాంస్కృతికంగా వీటిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. వాటిని పక్కన పెడితే దాయాదుల సమరం నేపథ్యంలో BHA vs PAK హ్యాష్ ట్యాగ్‌ 'ఎక్స్‌' ప్లాట్‌ఫామ్‌ అదేనండీ ట్విటర్లో ట్రెండింగ్‌ అవుతోంది. అభిమానులు మ్యాచ్‌ అప్‌డేట్స్‌ను #bhavspak #indvspakను జోడించి ఇస్తున్నారు. అలాగే మీమ్స్‌ను పంచుకుంటున్నారు. వర్షంతో మ్యాచ్‌ నిలిచిపోవడంతో ట్రోలింగ్‌ మొదలైంది.


కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా నేడు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సూపర్‌ 4 మ్యాచ్‌ జరుగుతోంది. వర్షంతో మ్యాచ్‌ నిలిపివేసే సమయానికి టీమ్‌ఇండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కింగ్‌ విరాట్‌ కోహ్లీ (8), కేఎల్‌ రాహుల్‌ (17) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (58; 52 బంతుల్లో 10x4, 0x6), రోహిత్‌ శర్మ (56; 49 బంతుల్లో 6x4, 4x6) హాఫ్‌ సెంచరీలు సాధించారు. షాదాబ్‌ ఖాన్‌, షాహీన్‌ షా అఫ్రిది చెరో వికెట్‌ పడగొట్టారు.


టాస్‌ ఓడి బ్యాటింగుకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. తమ మైండ్‌సెట్‌ను మార్చుకున్న ఓపెనర్లు పాక్‌ పేసర్లపై ఎదురుదాడికి దిగారు. సూపర్‌ డూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి మంచి కాన్ఫిడెన్స్‌తో కనిపించాడు. వణికిస్తాడని భయపడ్డ షాహిన్‌ షా అఫ్రిది బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను మార్చుకొనేలా ప్రెజర్‌ పెట్టాడు. అతడు వేసిన ఐదో ఓవర్లో మూడు బౌండరీలు కొట్టాడు. ఇక ఏడో ఓవర్‌ వేసిన నసీమ్ షా బౌలింగ్‌లోనూ ఇదే సీన్‌ రిపీట్‌ చేశాడు. దాంతో 37 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. మొదట్లో తడబడ్డ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తర్వాత రెచ్చిపోయాడు. ఒకానొక దశలో హిట్‌మ్యాన్‌ 32 బంతుల్లో 20 పరుగులతో నిలిచాడు. హ్యారిస్‌ రౌఫ్‌ వేసిన 11.6వ బంతిని బౌండరీకి పంపింన తర్వాత అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. షాదాబ్‌ ఖాన్‌ వేసిన 13వ ఓవర్లో ఆఖరి మూడు బంతుల్ని వరుసగా 6, 6, 4 బాదేసి స్కోర్‌ వేగం పెంచాడు. 15వ ఓవర్లో వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి హాఫ్‌ సెంచరీకి చేరుకున్నాడు.


అంతకు ముందు భారత్‌ అంశంపై మాజీ క్రికెటర్, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే వీరేందర్ సెహ్వాగ్ స్పందించారు. 'ఒక పేరు మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేనెప్పుడూ నమ్ముతాను. మనం భారతీయులం. ఇండియా అనే పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారు. దేశ అసలు పేరైన భారత్ ను అధికారికంగా తిరిగి తెచ్చుకునే సమయం వచ్చేసింది. ఈ వన్డే ప్రపంచకప్ లో మన ఆటగాళ్ల ఛాతీపై భారత్ అని ఉండేలా చూసుకోవాలి' అంటూ బీసీసీఐని, సెక్రటరీ జైషాను ట్యాగ్ చేశారు.


వీరేందర్ సెహ్వాగ్ దేశం పేరును భారత్ గా మార్చేందుకు మద్దతు ఇవ్వడంతో పలువురు ఆయనను ట్విట్టర్ వేదికగా విమర్శించడం మొదలుపెట్టారు. వాటిపై కూడా సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించారు. 'నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. గత రెండు ఎన్నికల్లోనూ రెండు ప్రధాన పార్టీలు నన్ను సంప్రదించాయి. చాలా మంది ఎంటర్‌టైనర్‌లు, క్రీడాకారులు రాజకీయాల్లోకి రాకూడదనేది నా అభిప్రాయం. చాలా మంది తమ సొంత ఇగో, అధికారం కోసం ఆకలితో ఉంటారు. ప్రజల కోసం నిజమైన సమయాన్ని వెచ్చిస్తారు. కొంత మంది అందుకు మినహాయింపు. కొంతమంది కేవలం ప్రచారం కోసమే చేస్తారు. క్రికెట్ తో కలిసి ఉండటం, కామెంటేటింగ్ చేయడం అంటేనే నాకు ఇష్టం. ఒక పార్ట్‌టైమ్ ఎంపీగా ఉండటాన్ని నేను కోరుకోవడం లేదు' అని సెహ్వాగ్ స్పందించారు.