IND vs PAK:
ఆసియాకప్ 2023 టీమ్‌ఇండియా రెచ్చిపోతోంది! పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచులో అదరగొడుతోంది. దాయాది బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. చివరి మ్యాచులో ప్రత్యర్థి పేసర్ల బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డ ఓపెనర్లు ఈ పోరులో చితక్కొట్టేస్తున్నారు. స్టైలిష్, యంగ్ అండ్ డైనమిక్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (55; 48 బంతుల్లో 10x4) అమేజింగ్ హాఫ్ సెంచరీ కొట్టేశాడు. వన్డే కెరీర్లో మూడో వేగవంతమైన అర్ధశతకం అందుకున్నాడు. మొదట్లో ఇబ్బంది పడ్డ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (56; 48 బంతుల్లో 6x4, 4x6) సైతం దూకుడు పెంచాడు. 50 పరుగుల మైలురాయి అందుకున్నాడు. దాంతో 16 ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసింది.
సొగసరి గిల్
టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. తమ మైండ్‌సెట్‌ను మార్చుకున్న ఓపెనర్లు పాక్ పేసర్లపై ఎదురుదాడికి దిగారు. సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి మంచి కాన్ఫిడెన్స్‌తో కనిపించాడు. వణికిస్తాడని భయపడ్డ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడు లైన్ అండ్ లెంగ్త్‌ను మార్చుకొనేలా ప్రెజర్ పెట్టాడు. అతడు వేసిన ఐదో ఓవర్లో మూడు బౌండరీలు కొట్టాడు. ఇక ఏడో ఓవర్ వేసిన నసీమ్ షా బౌలింగ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ చేశాడు. దాంతో 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
సిక్సర్ల మోత
కెప్టెన్ రోహిత్ శర్మ మొదట్లో తడబడ్డాడు. ఒక ఎండ్‌లో నసీమ్ షా చక్కని బంతులు వేయడమే ఇందుకు కారణం. దేహానికి దూరంగా బంతులేసి అతడిని ఇబ్బంది పెట్టాడు. ఆఫ్‌సైడ్ ఊరించే బంతులేశాడు. దాంతో ఒకానొక దశలో హిట్‌మ్యాన్ 32 బంతుల్లో 20 పరుగులతో నిలిచాడు. హ్యారిస్ రౌఫ్ వేసిన 11.6వ బంతిని బౌండరీకి పంపింన తర్వాత అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. షాదాబ్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో ఆఖరి మూడు బంతుల్ని వరుసగా 6, 6, 4 బాదేసి స్కోర్ వేగం పెంచాడు. 15వ ఓవర్లో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు.
పిచ్ రిపోర్టు
'ఎండ బాగానే ఉంది. ఆకాశంలో కారు మబ్బులేమీ లేవు. క్యూరేటర్లు పిచ్‌ను నీటితో తడిపారు. దీనర్థం వాతావరణం మారొచ్చు. వికెట్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది. కొత్త బంతితో పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. తేమ ఉండటంతో స్పిన్నర్లూ ప్రభావం చూపిస్తారు' అని మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, వకార్ యూనిస్ అన్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ జట్టు: ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రౌఫ్