Hyderabad Rains:
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆదివారం సైతం వర్షం కురవడంతో నగరంలో ఈ వీకెండ్ కూల్ కూల్ గా గడిచిపోతోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గ్, జూబ్లీహిల్స్ లో కుండపోత వాన పడుతోంది. అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, లక్డీకాపూల్, కోఠి, సికింద్రాబాద్, బేగంపేట, సరూర్‌నగర్, ఎర్రగడ్డ, ఫిల్మ్‌నగర్, తార్నాక, అబిడ్స్, నాంపల్లితో లలో వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. అత్యవసరమైతే ప్రజలు రోడ్లపైకి రావాలని, వర్షపు నీరు నిలిచిన చోట జాగ్రత్తగా నడవాలని నగర వాసులను హెచ్చరించారు.
మరోవైపు ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్ పేట, చాదర్ ఘాట్ లో వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణలో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో వర్షం ఆగకుండా కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అలర్ట్ చేశారు. మధ్యలో కాసేపు వాన ఆగినా, రాత్రి మొత్తం ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో నగరం తడిచి ముద్దవుతుందని అంచనా వేశారు. రాత్రివేళ నగరంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు.
తెలంగాణలో వర్షాలు..
రాష్ట్రంలో మరో నాలుగైదు రోజులు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని అధికారులు అంచనా వేశారు. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది.
వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు దిగొస్తున్నాయి. వర్షాలతో తెలంగాణలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగితే చెరువు కట్టలు తెగే అవకాశం ఉందని జిల్లాల అధికారులకు అలర్ట్ చేశారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని, పాత భవనాలలో తలదాచుకోవద్దు అని ప్రజలను హెచ్చరించారు.