ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వేదికగా నిలిచాయి. మన దేశంలోని వైవిధ్యాన్ని, శతాబ్దాల సాంస్కృతిక, హస్త కళా వైభవాన్ని విదేశీ ప్రతినిధులకు చాటిచెప్పేలా భారత్ మండపంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్ బజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ క్రాఫ్ట్స్ బజార్‌లో తెలుగు రాష్ట్రాల స్టాళ్లకు కూడా చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్టాళ్లలో ప్రముఖ హస్తకళల వస్తువులను విక్రయానికి ఉంచారు. ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హస్తకళ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ లేపాక్షి స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌లో హస్తకళలు, చేనేత వ్రస్తాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ స్టాల్‌లో బొబ్బిలి వీణ, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి చేనేత వస్త్రాలు, కొండపల్లి, అనకాపల్లి, విజయనగరం బొమ్మలు అందుబాటులో ఉంచారు. తిరుపతిలో చెక్కతో చెక్కిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు రూ.30 లక్షల విలువైన వస్తువులను విక్రయానికి ఉంచినట్టు ఆప్కో, లేపాక్షి ప్రతినిధులు తెలిపారు.
విదేశీ అతిథులకు లేపాక్షి ఉత్పత్తుల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు అధికారులు. ఉత్పత్తుల నేపథ్యం.. వాటికున్న వారసత్వం, సంస్కృతిని సవివరంగా వివరిస్తున్నారు. ఏపీకి చెందిన హస్తకళలు, చేనేత వ్రస్తాలకు విదేశీ ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభిస్తోందని కూడా లేపాక్షి అధికారులు తెలిపారు. మరోవైపు.. గిరిజన ఉత్పత్తుల స్టాల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీని కూడా ప్రదర్శనకు ఉంచారు.
ఇక.. తెలంగాణ స్టాల్‌లో చేర్యాల పెయింటింగ్స్, గద్వాల, పోచంపల్లి చేనేత వస్త్రాలు, నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ వెండి ఫిలిగ్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి కళకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి కళాఖండాలు విశ్వవ్యాప్తమయ్యాయి. స్వచ్ఛమైన వెండితో అతి సున్నితంగా.. పూర్తిగా చేతితోనే తయారు చేసే ఈ కళారూపాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. యునెస్కో అవార్డు, నాలుగు జాతీయ అవార్డులు కూడా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి కైవసం చేసుకుంది. ఇక, నిర్మల్ పెయింటింగ్స్‌కు సంబంధించిన స్టాల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సదస్సులో పాల్గొనే దేశాధ్యక్షులు, ప్రధానులకు అశోకచక్రం ఆకారంలో వెండి తీగతో తయారు చేసిన బ్యాడ్జీలను అలంకరించారు. రెడీమేడ్‌గా తయారు చేసుకొచ్చిన హస్త కళాకృతులే కాకుండా అక్కడే సజీవంగా అందరి ముందు తయారుచేసి చూపే ఏర్పాట్లు చేశారు. కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, దారం వడికే రాట్నం, తంజావూరు, రాజస్థాన్ పెయింటింగ్‌లన్నీ అందరి ముందు వేసి అందించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇండియన్ క్రాఫ్ట్స్‌లో ప్రధానంగా బొబ్బిలి వీణ, వేప చెక్కతో తయారు చేసిన శ్రీవేంకటేశ్వరస్వామి నిలువెత్తు విగ్రహం ఆకట్టుకుంటున్నాయి. వెండితో చేసిన ఏడుకొండలవాడి ఫిలిగ్రీ విగ్రహాలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.