యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్, తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి దిల్లీలోని ప్రముఖ అక్షరధామ్ ఆలయాన్ని ఈరోజు ఉదయం సందర్శించారు. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన వారు ఆదివారం ఉదయమే సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఆలయానికి వెళ్లారు. వీరి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి అయిన తర్వాత భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారు. ఆయన సతీమణి అక్షతామూర్తి భారత్‌కు చెందినవారు అని తెలిసిందే. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, సుధా మూర్తిల కుమార్తె ఆమె. రిషి సునాక్ తల్లిదండ్రులు కూడా భారత మూలాలు ఉన్నవారే. వారు తూర్పు ఆఫ్రికా మీదుగా బ్రిటన్‌కు వలస వెళ్లారు. రిషి సునాక్ అక్కడే జన్మించారు.
రిషి ఓ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూ తన హిందూ మూలాలపై గర్వపడుతున్నానని తెలిపారు. భారత్‌లో ఆలయ దర్శనానికి సమయం దొరుకుతుందని ఆశిస్తున్నానంటూ నిన్న రిషి వెల్లడించారు. అలాగే తాను, తన భార్య అక్షత కలిసి దిల్లీలోని తమ ఫేవ్‌రెట్ రెస్టారెంట్స్‌కు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే ఆయన గతంలో మాట్లాడుతూ.. తనను భారత్ అల్లుడు అని పిలవడం చాలా సంతోషంగా ఉందని, అది ఎంతో ఆత్మీయమైన పిలుపు అని, భారత్ పర్యటనకు తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. భారత్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఆయన దిల్లీలో ఉండనున్నారు.
ప్రధాని మోదీ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, జీ 20 సదస్సులో ఆయన విజయం సాధించడం కోసం మోదీకి మద్దతు ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సునాక్ వెల్లడించారు. ఈ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ, రిషి సునాక్‌తో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. వాణిజ్య సంబంధాలను మరింత పెంచడానికి, పెట్టుబడులు పెంచడానికి మార్గాలను గురించి చర్చించారు. సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కలిసి అడుగులు వేయాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. ఆర్థిక రక్షణ, సాంకేతికత, హరిత ఇంధనం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం తదితర రంగాల్లో పురోగతిపై వారు సంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అన్ని అంశాలపై మరింత సమగ్రంగా చర్చించుకునేందుకు వీలుగా సాధ్యమైనంత త్వరగా మళ్లీ కలుద్దామని మోదీ ప్రతిపాదించగానే సునాక్ దానికి అంగీకరించారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. రెండు దేశాలు, ఒకే ఆకాంక్ష అని, మనం పరస్పరం పంచుకునే విలువల్లో దాని మూలాలు దాగి ఉన్నాయని, మన దేశాల మధ్య చక్కని సంబంధాలు ఉన్నాయి, క్రికెట్ అంటే రెండు దేశాలకు ఇష్టం అని రిషి సునాక్ ట్వీట్ చేశారు.
ఈ ఏడాది మేలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సమావేశంల సందర్భంగా కూడా ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. దీనిలో వారు భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.