Foxcon Plant:
మొబైల్ విడిభాగాలు తయారీ..
ఫాక్స్‌కాన్ (Foxcon) సంస్థతో తమిళనాడు ప్రభుత్వం భారీ డీల్ కుదుర్చుకుంది. రాష్ట్రంలో మొబైల్ ఫోన్‌ల విడిభాగాలు తయారు చేసేందుకు రూ.1,600 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. Foxconn International Internet (FII) త్వరలోనే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తమిళనాడు ప్రభుత్వం సూచనల మేరకు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఫాక్స్‌కాన్ చీఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ని కలిసి ఈ డీల్ కుదుర్చుకున్నారు.
"ఫాక్స్‌కాన్ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. కాంచీపురం జిల్లాలో మొబైల్ విడిభాగాల తయారీ ప్లాంట్‌ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా 6 వేల మందికి ఉపాధి లభిస్తుంది"
- అధికార ప్రతినిధులు
శ్రీపెరంబుదూర్‌లో ప్లాంట్..
ఇప్పటికే రాష్ట్రంలో ఫాక్స్‌కాన్‌కి సంబంధించిన Apple iPhone తయారీ ప్లాంట్ శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఈ ప్లాంట్‌లో దాదాపు 35 వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీనిపై రాష్ట్ర పారిశ్రామిక మంత్రి డాక్టర్ టీఆర్‌బీ రాజా స్పందించారు. ఫాక్స్‌కాన్ సంస్థ తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోందని వెల్లడించారు.
"తమిళనాడులో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపిస్తోంది. క్రమంగా ఇక్కడ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏ బడా సంస్థ అయినా సరే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఇది"
- టీఆర్‌బీ రాజా, తమిళనాడు పారిశ్రామిక మంత్రి
ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో నంబర్ వన్
2022-23 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది తమిళనాడు. మొత్తంగా 5.3 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. 2030 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను లక్ష కోట్ల డాలర్లకు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. రాష్ట్రానికి మరి కొన్ని పెట్టుబడులు వరుస కడతాయని మంత్రి రాజా ధీమా వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో దేశంలోనే తమిళనాడు టాప్‌లో ఉందని వెల్లడించారు. త్వరలోనే ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కేవలం ఎలక్ట్రానిక్ గూడ్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ ప్లాంట్‌లు కూడా తమిళనాడులో ఏర్పాటయ్యాయి. Ola Electricతో పాటు మరి కొన్ని సంస్థల ప్లాంట్‌లూ ఉన్నాయి. రాష్ట్రం అనుసరిస్తున్న ప్లగ్ అండ్ ప్లే పాలసీపై అన్ని సంస్థలూ ఆసక్తి చూపిస్తున్నాయి.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ ఫాక్స్‌కాన్ పరిశ్రమ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని... కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ ఇటీవలే సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కోరారు. అంతేకాక, తైవాన్‌లో పర్యటించాలని యంగ్ ల్యూ కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది.
Also Read: ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారు? మణిపూర్ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు