Court Fine For CBI Ex Chief : సీబీఐ మాజీ డైరక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు ఢిల్లీ హైకోర్టు రూ. పదివేల జరిమానా విధించింది. ఎందుకంటే ఆయన ట్విట్టర్ కంపెనీ తన ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ తొలగించిందని ఆయన పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారణ సందర్బంగా ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ ఏడో తేదీన తాము ఓ ఆర్డర్ ఇచ్చామని అయినా వెంటనేఎందుకు మళ్లీ కోర్టుకు వచ్చారని ప్రశ్నించింది. మా నుంచి రిటర్న్ గిఫ్ట్ ఆశిస్తున్నారా అని ప్రశ్నించింది. రూ. పదివేల ఫైన్ విధించి.. పిటిషన్‌ను డిస్మస్ చేసింది.  


తెలుగు వ్యక్తి అయిన మన్నెం నాగేశ్వరరావు ఒడిషా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. 2018లో సీబీఐ డైరక్టర్, అడిషనల్ డైరక్టర్ మధ్య జరిగిన వివాదంలో వారిద్దర్నీ బలవంతంగా సెలవులో పంపిన తర్వాత తాత్కలికంగా సీబీఐ డైరక్టర్‌గా  మన్నెం నాగేశ్వరరావును నియమించారు.  అర్థరాత్రి చార్జ్ తీసుకుని.. తెల్ల వారే సరి కల్లా కీలక అధికారుల్ని బదిలీలు చేసేశారు. అయితే బదిలీలు చేయవద్దని అప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఆయన చేశారు. ఆ తర్వాత కొంత కాలానికే ఆయనను కేంద్రం సీబీఐ నుంచి తొలగించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన, అవినీతి ఆరోపణల కారణంగా.. ఆయనను.. సీబీఐ నుంచి తొలగిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. 


నిజానికి కోర్టు ధిక్కరణ కేసులో  సుప్రీంకోర్టు ఆయనకు అప్పట్లో శిక్ష విధించింది. తెలియకుండా తప్పు చేశానని క్షమించాలని మన్నెం వేడుకున్నా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. నాగేశ్వరరావుకు రూ.లక్ష జరిమానా విధించింది. సాయంత్రం వరకూ.. కోర్టులోనే ఓ మూల కూర్చోబెట్టింది. ఆ శిక్ష ముగిసిన తర్వాత ఆయనను కేంద్రం ఓ అప్రాథాన్య పోస్టుకు పంపేసింది. ఆ తర్వాత రిటైరయ్యారు. 


రిటైరైన తర్వాత ఆయన హిందూత్వానికి సంబంధించిన ట్వీట్లు చేస్తున్నారు. పలు మార్లు భారత చరిత్రను వక్రీకరించారని.. భారత నాగరికతను కుట్ర ప్రకారం అబ్రహమైజేషన్‌ చేశారని చెబుతూ ట్వీట్లు చేశారు.  దీంతో ఆయన ట్విట్లపై రిపోర్టులు వెళ్లాయేమో కానీ వెరీఫైడ్ అకౌంట్లకు ఇచ్చే బ్లూటిక్‌ను ట్విట్టర్ తొలగించింది. ఈ  బ్లూ టిక్ కోసం ట్విట్టర్‌ను సంప్రదించినా రెస్పాండ్ రాలేదు. కోర్టుకెళ్తే జరిమానా కట్టాల్సి వచ్చింది.