ఇజ్రాయెల్ దళాలు గాజాపై బాంబు దాడులు చేస్తున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాల్లో హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు సాగుతోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్దం నేపథ్యంలో ఎయిర్‌ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకలను ఈ నెల 14 వరకు రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని స్పష్టం చేసింది. శనివారం నుంచే టెల్ అవీవ్‌కు రాకపోకలను క్యాన్సిల్ చేసింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపేసినట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ఏ సాయం కావాలన్నా...
ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు ఎలాంటి సహాయం కావాలన్నా, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న వారికే వాస్తవ పరిస్థితులు తెలుసునని, ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది అన్ని విధాలా సాయం అందిస్తుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా హమాస్ మిలిటెంట్లు కొందరు పౌరులు, ఐడీఎఫ్ సైనికులను బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకువెళ్లారు. దీంతో విదేశాంగ శాఖ భారతీయులను అప్రమత్తం చేసింది.
సరిగ్గా 50 ఏళ్ల కిందట దాడి..
సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం 1973 అక్టోబరు 6న ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడి జరిగింది. ఒకవైపు నుంచి ఈజిప్టు, మరోవైపు నుంచి సిరియా విరుచుకుపడ్డాయి. ఈ యుద్ధానికి ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు పేరు పెట్టుకున్నారు. కొంతమంది దీన్ని అక్టోబరు యుద్ధమని, మరికొందరు యామ్ కిప్పూర్ యుద్ధమని, ఇంకొందరు రమదాన్ యుద్ధమని, ఇతరులు నాలుగో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధమని పిలుచుకున్నారు. పేరు ఏదైనా ఈ యుద్ధంతో మధ్య ఆసియానే కాదు యావత్ ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపించింది. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జోరుగానే సాగాయి. కానీ అవి ఫలించలేదు. ఇరు దేశాల మధ్య చిచ్చు ఆరడం లేదు. పెద్దగానో, చిన్నగానో ఘర్షణలు తరచూ సాగుతునే ఉన్నాయి. 50 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మళ్లీ ఇజ్రాయెల్‌పై పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ దాడులు చేసింది.
దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలన్ని ఇజ్రాయెల్ అండగా నిలుస్తుంటే... ముస్లిం దేశాలు పాలస్తీనాకి బాసటగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు అరబ్ దేశాలకు అండగా నిలిచిన సోవియట్ యూనియన్ దూరమైంది. సోవియట్ యూనియన్ ముక్కలు ముక్కలుగా విడిపోవడం పాలస్తీనా పరిస్థితి దారుణంగా తయారైంది. సోవియట్ యూనియన్ ఏకంగా 15 దేశాలుగా విడిపోయింది. దీనికి తోడు ప్రస్తుతం రష్యా... ఉక్రెయిన్‌తో రెండేళ్లుగా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలను నేలమట్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలైన రష్యా.. .ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం గురించి పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు.
తీవ్రవాదం ఎప్పటికీ సమర్థనీయం కాదని, తమ పౌరులను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు. హమాస్ దాడిని యూరోపియన్ యూనియన్ ఖండించింది. హమాస్ ఉగ్రవాదుల అమానుష హింస దిగ్భ్రాంతికరమని స్పెయిన్ వ్యాఖ్యానించింది. దుందుడుకు చర్యలకు ఇజ్రాయెల్, పాలస్తీనాలు దూరంగా ఉండాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సూచించారు. ఇజ్రాయెల్‌పై దాడిని రిషి సునాక్ ఖండించారు. ఆ దేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు.