Israel Palestine Attack: 


ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న భారతీయులు..


పాలస్తీనా ఉగ్రవాదుల మెరుపు దాడులతో (Israel Gaza Attack Live) ఇజ్రాయేల్ అతలాకుతలం అవుతోంది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడి పౌరులు పరుగులు పెడుతున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో (Israel Palestine War) అక్కడే చిక్కుకుపోయిన భారతీయులు చాలా మంది ఉన్నారు. వాళ్లను సురక్షితంగా భారత్‌కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కేవలం విద్యార్థులే కాదు. మేఘాలయ నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)లో సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ డాక్టర్ వన్‌వీరాయ్ ఖర్లుఖి, ఆయన భార్య, కూతురు అక్కడే చిక్కుకుపోయారు. ఆయనతో పాటు మరో 24 మంది భారతీయులూ అక్కడ భయంతో వణికిపోతున్నారు. మేఘాలయా నుంచి వీళ్లంతా జెరూసలెం సందర్శనకు వెళ్లారు. బెత్లెహం వద్ద చిక్కుకున్నారు. ఓ వైపు హింస అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై మేఘాలయా ముఖ్యమంత్రి కొర్నాడ్ సంగ్మా స్పందించారు. భారత విదేశాంగ మంత్రిత్వశాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. వాళ్లందరినీ సురక్షితంగా భారత్‌కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి వాళ్లని ఈజిప్ట్‌కి తరలించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇజ్రాయేల్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల్ని అప్రమత్తం చేసింది. ఏ అవసరమున్నా కాంటాక్ట్ అవ్వాలని సూచించింది. అనవసరంగా బయటకు రావద్దని తెలిపింది.


18 వేల మంది భారతీయులు..


ఇజ్రాయేల్‌లో 18 వేల మంది భారతీయులున్నారు. వీళ్లలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే ఉన్నారు. భారత మూలాలున్న 85 వేల మంది జూదులూ ఉన్నారు. భారత్ నుంచి ఇజ్రాయేల్‌కి 1950ల నుంచే వలసలు పెరిగాయి. అప్పటి నుంచి 1960 వరకూ కొనసాగాయి. అయితే..ఈ మధ్య కాలంలో ఈ వలసలు మరింత పెరిగాయి. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్‌ నుంచి ఎక్కువ మంది ఇజ్రాయేల్‌కి వెళ్తున్నారు. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం (The Embassy of India in Israel) సూచించింది. అనవసరంగా బయటకు రావద్దని చెప్పింది. భారతీయుల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సేఫ్‌టీ ప్రోటోకాల్స్‌ని పాటిస్తూ భద్రతా శిబిరాల్లోనే ఉండాలని సూచనలు చేసింది. స్థానిక అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. అందులో అడ్వైజరీ డాక్యుమెంట్స్‌ లింక్‌లు షేర్ చేసింది. మిజైల్ దాడులు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇందులో వివరించింది ఇండియన్ ఎంబసీ. ఇజ్రాయేల్‌లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.టెల్‌ అవీవ్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది అర్సెన్ ఒస్ట్రోవ్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడిదక్కడే వదిలేసి షెల్టర్‌ల కోసం పరుగులు తీయాల్సి వస్తోందని చెప్పారు. గాజా సరిహద్దుకి దూరంగా ఉన్న వాళ్లు కాస్తో కూస్తో ప్రశాంతంగా ఉన్నారని వెల్లడించారు.