Delhi ITO Fire Accident: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం (Income Tax office in Delhi)లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మొదట ఐటీ ఆఫీసు వద్దకు 10 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నించాయి. అంతలోనే మరో 11 ఫైరింజన్లు అక్కడికి చేరుకోవడంతో మొత్తం 21 ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని జాతీయ మీడియా ANI రిపోర్ట్ చేసింది.




మంటలు బిల్డింగ్ లో పలు అంతస్తులకు వ్యాపించడంతో ఐటీవోలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఊపిరి ఆడక కొందరు ఇబ్బంది పడ్డారు. రెస్క్యూ టీమ్, ఫైర్ టీమ్ ఆఫీసులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. రెస్క్యూ టీమ్ కాపాడిన వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన వారిని అంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.






సిలిండర్ల పేలుడుతో కలకలం
ఢిల్లీలో మరోచోట అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలో రెండు గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. పెద్ద శబ్ధంతో సిలిండర్ల పేలుడుతో ఆ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటల్ని ఆర్పివేశారని వార్తా సంస్థ PTI వెల్లడించింది. షాపూర్ జాట్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో ఉదయం 5.16 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు కాల్ చేయడంతో సమాచారం అందుకున్నాక మూడు ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చాయని డీఎఫ్ఎస్ అధికారి తెలిపారు. ఆ ప్రమాదంలో ఎలాంటి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని, కానీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు.