Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే సీజన్‌ కొనసాగుతోంది. పన్ను చెల్లింపులకు సంబంధించి, ఆదాయ పన్ను విభాగం ఎప్పటికప్పుడు ఏదోక అప్‌డేట్‌ ఇస్తూనే ఉంది. తాజాగా, "వార్షిక సమాచార ప్రకటన"లో (Annual Information Statement లేదా AIS) కొత్త ఫీచర్‌ను జోడించినట్లు తెలిపింది. 


ఒక ఇండివిడ్యువల్‌ టాక్స్‌పేయర్‌కు జీతం/వ్యాపార ఆదాయం/రెమ్యునరేషన్‌ రూపంలోనే కాకుండా, వారికి తెలీకుండానే మరికొన్ని మార్గాల నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది. జీతం కాకుండా ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయాల ‍‌(Income from other resources) గురించి AIS చెబుతుంది. దీనివల్ల, ఆయా లావాదేవీలపై పన్ను వర్తించే అవకాశం గురించి పన్ను చెల్లింపుదారుకు తెలుస్తుంది. ITR ఫైల్‌ చేసే ముందు దీనిని కచ్చితంగా చూడడం తెలివైన టాక్స్‌పేయర్‌ లక్షణం. ఐటీఆర్ ఫైలింగ్‌ సమయంలో పారదర్శకత తీసుకురావడానికి, పన్ను చెల్లింపుదార్ల సెల్ఫ్‌-ఫైలింగ్‌ పక్రియను సులభంగా మార్చడానికి డిపార్ట్‌మెంట్ దీనిని ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనిని మరింత అప్‌డేట్‌ చేస్తోంది. ఫామ్‌-16తో పాటు AISను కూడా చూడడం వల్ల, ఫైలింగ్‌లో తప్పులు జరిగే అవకాశాలు దాదాపుగా తగ్గిపోతాయి. 


AISలో వచ్చిన కొత్త వ్యవస్థ        
ఇప్పుడు, AISలో కనిపించే ప్రతి లావాదేవీపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చే సౌలభ్యం పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులోకి వచ్చింది. సోర్స్‌ నుంచి అందుకున్న సమాచారానికి సంబంధించిన ఖచ్చితత్వంపై పన్ను చెల్లింపుదారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. తప్పుడు రిపోర్టింగ్ విషయంలో, అది ఆటోమేటిక్‌గా ధృవీకరణ కోసం సోర్స్‌కు వెళుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్‌ ద్వారా, ఆదాయ సమాచారం అందించిన మార్గం/సోర్స్‌ గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది. సమాచార ధృవీకరణ పని ఏ స్థాయిలో ఉందో "స్టేటస్‌" కూడా చెక్‌ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారు ఇచ్చిన స్పందనను పాక్షికంగా లేదా పూర్తిగా సదరు వనరు అంగీకరించిందా లేదా అన్నది అందులో తెలుస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (CBDT) పేర్కొంది.            






CBDT ప్రకటన ప్రకారం, పన్ను చెల్లింపుదారు అభిప్రాయాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఆ సోర్స్‌ అంగీకరించిందా లేదా తిరస్కరించిందా? అన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. పాక్షిక లేదా పూర్తి అంగీకారం విషయంలో, మూలం నుంచి దిద్దుబాటు ప్రకటనను దాఖలు చేయడం ద్వారా సమాచారాన్ని సరిచేయాలి.           


మరో ఆసక్తికర కథనం: షాక్‌ ట్రీట్‌మెంట్‌ డోస్‌ పెంచిన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి