Prescriptions For Pesticides: ఆరోగ్యం కోసం వాడే మందులు కొనాలంటే వైద్యుల చీటి ఉండాల్సిందే. కొన్ని మందులకైతే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకపోతే మందులు ఇవ్వరు. నిద్ర మాత్రలు లాంటివైతే వైద్యుల నుంచి చీటి తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే వాటి మోతాదు, వేసుకునే వేళలు చాలా కీలకం. వ్యవసాయంలో పురుగుల మందులు కూడా ఇలాంటివే. ఏమాత్రం ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. ఎక్కువైతే పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది. తక్కువైతే పురుగు నశించక అలా కూడా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అందుకే పురుగు మందులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎరువులు, పురుగు మందులు కొనడానికి వ్యవసాయ అధికారుల నుంచి చీటిలు ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్ల క్రితమే ఈ విధానంపై ఆదేశాలివ్వగా.. అది నామమాత్రంగానే అమలైంది. వ్యవసాయ అధికారుల చీటి లేకుండానే ఎరువుల అమ్మకాలు జరిగాయి. కానీ వచ్చే పంటల నుంచి పక్కాగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించాయి. 


విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువులు పిచికారి చేయడంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఏ పంటకు ఏ మందులు వాడాలో వాటినే వాడాలి. మోతాదుకు మించితే పంట నష్టంతో పాటు పర్యావరణంపై ప్రభావం పడుతుంది. అందుకే కట్టుదిట్టంగా పురుగు మందులు, ఎరువుల విక్రయాలు జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, సహాయ సంచాలకులు చీటీ రాసిస్తేనే డీలర్లు విక్రయాలు చేయనున్నారు. 


ధ్రువీకరణ లేకుండా విక్రయిస్తే చర్యలే


ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువుల అమ్మకాల జరిపితే క్రమంగా వాటి వాడకాన్ని అరికట్టవచ్చు అన్నది నిపుణుల భావన. వ్యవసాయ విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ చట్టం 1983, ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం కఠిన చర్యాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ వ్యవసాయ అధికారి ధ్రువీకరణ లేకుండా విక్రయాలు చేస్తే చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నారు. పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి, జొన్న, అపరాలు, కూరగాయలు తదితర పంటలకు ఏ తెగుళ్లు సోకినా వ్యవసాయ అధికారులే ఏ మందులు పిచికారి చేయాలో నిర్దేశించనున్నారు. 


Also Read: Apple Prices: చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్న యాపిల్, కొండెక్కనున్న ధరలు


నిబంధనలు కఠినతరం


జీవ ఎరువులు, జీవ పురుగు మందులకు సంబంధించి ప్రభుత్వ అనుమతి గల వాటినే విక్రయించాలి. అలాగే పురుగు మందులు కొనే ప్రతి ఒక్కరికి బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే దుకాణాల్లో ఎరువుల నిల్వ వివరాలు, ధరల బోర్డు, లైసెన్సు, స్టాక్ రిజిస్టర్స్, నిల్వ చేసే స్థల వివరాలన్నీ ప్రదర్శించాలని చట్టం పేర్కొంటుంది. ఇందులో ఏ ఒక్క నిబంధన ఉల్లంఘించినా అనుమతి రద్దు చేయాలని ఆదేశాలు చారీ చేశారు. ఇందులో ఏది పాటించకున్నా అనుమతి రద్దు చేస్తారు. రోజువారీగా వివరాలను నమోదు చేయడంతో పాటు ప్రతి అంశాన్ని పేర్కొనాలని నిర్దేశించారు.  వ్యవసాయ రంగంలో రైతుల ప్రయోజనం, ప్రభుత్వ ఆదాయం దృష్ట్యా కఠినంగా వ్యవహరించనున్నారు.