AK-47 Rifle Gift: 


AK 47 గన్ గిఫ్ట్..


వెడ్డింగ్ యానివర్సరీకి వైఫ్‌కి ఏం గిఫ్ట్ అవ్వాలో అని చాలా మంది తెగ ఆలోచిస్తుంటారు. ఊహించనిదేదో ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలనుకుంటారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ లీడర్ కూడా ఇలాగే అనుకున్నారు. తన భార్యకు అనూహ్యమైన గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇదే పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. ఆయన భార్యకు ఆయన గిఫ్ట్ ఇచ్చుకుంటే వివాదం ఏముంది..అనుకోవచ్చు. కానీ...ఆ ఇచ్చిన గిఫ్ట్ సాధారణమైంది కాదు. AK 47 గన్. అవును TMC మాజీ నేత రైజల్ హక్ తన భార్యకు ఈ గన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇలా తన ప్రేమని చూపించారన్నమాట. పోనీ అక్కడితో వదిలేశారా అంటే లేదు. తాను గిఫ్ట్ ఇచ్చిన సంగతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన భార్య AK 47 గన్ ని పట్టుకుని ఉన్న ఫొటోని పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేశారో లేదో వెంటనే వివాదాస్పదమైంది. చాలా మంది పొలిటికల్ లీడర్స్‌ తీవ్రంగా మండి పడ్డారు. "మీరేమైనా తాలిబన్‌లా..? గన్స్ గిఫ్ట్‌గా ఇచ్చుకోవడమేంటి..?" అని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ విమర్శలు తట్టుకోలేక రైజల్ వెంటనే ఆ పోస్ట్‌ని డిలీట్ చేశారు. మిలిటరీ, పారామిలిటరీ ఆపరేషన్స్‌లో మాత్రమే వినియోగించే ఏకే 47 గన్ ఆయన చేతికి ఎలా వచ్చిందన్న దానిపైనే పెద్ద రచ్చ జరిగింది. వెంటనే తన తప్పు సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. అది కేవలం బొమ్మ తుపాకీ అంటూ వివరణ ఇచ్చుకున్నారు. 


"నేను కానీ, నా భార్య కానీ ఎలాంటి తప్పు చేయలేదు. తాను ఓ బొమ్మ తుపాకీని పట్టుకుందంతే. ఆ ఫొటోనే షేర్ చేశాను. నాపై వచ్చే ఆరోపణలన్నీ అవాస్తవమే. అది ఫేక్ గన్. చాలా మంది నన్ను ఈ ఫొటో గురించి అడిగారు. అందుకే వెంటనే డిలీట్ చేశాను."


- రైజల్ హక్, టీఎమ్‌సీ మాజీ నేత 


రెండు నెలల క్రితం రాజీనామా..


తృణమూల్ మైనార్టీ సెల్‌కి ప్రెసిడెంట్‌గా పని చేసిన రైజల్..రెండు నెలల క్రితం ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే..బీజేపీ మాత్రం ఈ ఘటనపై తీవ్రంగా మండి పడుతోంది. కచ్చితంగా విచారించాల్సిందేనని పట్టుపడుతోంది. అటు వామపక్షాలు కూడా విచారణ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా పబ్లిక్‌గా ఆయుధాలు పట్టుకుని తిరగడమేంటని ప్రశ్నిస్తున్నాయి. అది బొమ్మ తుపాకీయేనని రైజల్ వివరణ ఇస్తున్నప్పటికీ దాన్ని నమ్మడం లేదు పార్టీలు. 


"రైజల్ హక్‌కి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది. దీనిపై విచారణ జరపాలి. ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ చూశాను. ఆయన టీఎమ్‌సీ మాజీ నేత. డిప్యుటీ స్పీకర్‌కి చాలా సన్నిహితుడు. ఇలాంటి వ్యక్తి ఈ పోస్ట్‌లతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తాలిబన్ రూల్‌ని ప్రమోట్ చేస్తున్నారా..? యువతను జిహాదీలుగా మారాలని సందేశమిస్తున్నారా"


- దుర్బో సహా, బీజేపీ నేత 


Also Read: ల్యాండర్ విక్రమ్ ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్, నావిగేషన్ కెమెరాతో క్లిక్