Praggnanandhaa: ఇటీవల జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ లో రన్నరప్ గా నిలిచి అతి చిన్న వయస్సులోనే ఆ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు ప్రజ్ఞానంద. బాకు లో జరిగిన ప్రపంచ చెస్ టోర్నీ తర్వాత తొలిసారిగా చెన్నైకి వచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు తమిళనాడు వాసులు ఘన స్వాగతం పలికారు. ప్రజ్ఞానంద చెన్నై విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందే జనం పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అభిమానులతో పాటు ప్రజ్ఞానంద స్కూల్ మేట్స్ కూడా భారీ సంఖ్యలో విమానాశ్రయానికి వచ్చారు. వీరి రాకతో చెన్నై విమానాశ్రయం కిటకిటలాడింది. ప్రజ్ఞానందకు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో సిద్ధమయ్యారు. ప్రజ్ఞానంద ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే.. సాంప్రదాయ నృత్యాలు చేస్తూ అతనికి సాదరంగా స్వాగతం పలికారు.


చెన్నై వాసులు చూపించిన అభిమానం పట్ల ప్రజ్ఞానంద సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా తనకు స్వాగతం పలకడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు ప్రజ్ఞానంద. విమానాశ్రయంతో పాటు ప్రజ్ఞానంద ఇంటి వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది. తనకు అభినందనలు చెబుతూ హోర్డింగ్ లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 






చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద


భారత గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్లకే చదరంగ ప్రపంచకప్‌ రన్నరప్‌గా అవతరించాడు. ఫైనల్లో విజయం సాధించనప్పటికీ భారతీయులు గర్వపడేలా చేశాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత విశ్వ చదరంగ యుద్ధాల్లో మహామహులను ఢీకొట్టగల ధీరుడు మనకున్నాడని చాటాడు. భవిష్యత్తులో కచ్చితంగా గెలుస్తాననే ధీమాను కల్పించాడు.


ఆగస్టు 24 మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో జరిగిన ట్రైబ్రేక్‌లో ప్రజ్ఞానంద పోరాడి ఓడాడు. ర్యాపిడ్‌ రౌండ్‌లో మొదటి 25+10 గేమ్‌లో ఓటమి చవిచూశాడు. తెల్ల పావులతో రంగంలోకి దిగిన అతడు సమయం గడిచేకొద్దీ ఇబ్బంది పడ్డాడు. కార్ల్‌సన్‌ ఎత్తులకు పైఎత్తులు వేయలేకపోయాడు. దాంతో సమయం మించిపోయింది. సాధారణంగా తెల్ల పావులతో ఆడేటప్పుడు ప్రగ్గూ కొద్దిగా వెనుకంజ వేస్తాడు. ప్రత్యర్థిని ఉచ్చులో బిగించడానికి ఆలోచనలు రావని అతడే చెప్పాడు.


టైబ్రేక్‌ మొదటి గేమ్‌ ఓడిపోవడంతో ప్రజ్ఞానందకు రెండో దాంట్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్ల కుర్రాడిపై ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆధిపత్య ఒత్తిడి కనిపించింది. తనకు బలమైన నల్లపావులతో ఆడుతుండటంతో ఏదైనా మ్యాజిక్‌ చేయకపోతాడా అని అభిమానులు ఆశించారు. మొదట్లో ప్రత్యర్థికి దీటుగా ఎత్తులు వేసినప్పటికీ ఐదు నిమిషాల తర్వాత అనూహ్యంగా ఒత్తిడిలోకి జారుకున్నాడు.


అత్యంత వేగంగా పావులు కదుపుతున్న కార్ల్‌సన్‌ను అడ్డుకోవడంలో ప్రజ్ఞానంద విఫలమయ్యాడు. ప్రత్యర్థి సిసిలియన్‌ డిఫెన్స్‌ వ్యూహానికి అతడి వద్ద జవాబు లేకుండా పోయింది. తెల్ల పావులతో ఆడేవాళ్లకి సిసిలియన్‌ డిఫెన్స్‌ అత్యంత రక్షణాత్మకంగా ఉంటుంది. ఆ తర్వాత రెండు మూడు ఎత్తులు వేసిన ప్రగ్గూ ఇక విజయం కష్టమేనని భావించాడు. పది నిమిషాలు ఉండగానే గేమ్‌ డ్రా చేసుకుంటానని మాగ్నస్‌ను కోరాడు. అతడూ అంగీకరించడంతో మ్యాచ్‌ ముగిసింది.


ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చదరంగ ప్రపంచకప్‌ గెలవడం ఇదే తొలిసారి. ఇక ప్రజ్ఞానంద భవిష్యత్తుకు ఆశాకిరణంగా మారాడు. ఈ విజయంతో విజేత మాగ్నస్ కార్ల్‌సన్‌కు    ఏకంగా 1.1 లక్షల యూఎస్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.90.9 లక్షలు) లభించాయి. రన్నరప్‌ ప్రగ్గూకు 80 వేల డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.66.13 లక్షలు) వచ్చాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌ మనీ రూ.15.13 కోట్లు.