Arvind Kejriwal:
ప్రధాని అభ్యర్థి ఎవరు..?
విపక్ష కూటమి I.N.D.I.A కూటమి ముంబయిలో రెండ్రోజుల పాటు భేటీ కానుంది. ఈ సమావేశంలోనే యాక్షన్ ప్లాన్ అంతా సిద్ధం చేసుకునే అవకాశాలున్నాయి. అంతే కాదు. ఈ కూటమికి నేతృత్వం వహించేది ఎవరో కూడా తేల్చేస్తారని చెబుతున్నారు కొందరు నేతలు. విపక్ష కూటమి తరపున ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఈ విషయంలో ప్రకటనలు చేస్తున్నాయే తప్ప అధికారికంగా ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. రాహుల్ గాంధీయే కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి అని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీనిపై చర్చ జరుగుతుండగానే...ఆప్ ప్రతినిధి మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కూటమిని ఆప్ డిమాండ్ చేస్తోంది. ఆప్ జాతీయ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఈ డిమాండ్ వినిపించారు. ఇదే సమయంలో మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ద్రవ్యోల్బణంతో దేశం సతమతం అవుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. దేశమంతా ఎలా ఉన్నా ఢిల్లీ మాత్రం అభివృద్ధితో దూసుకుపోతోందని తేల్చి చెప్పారు ప్రియాంక కక్కర్.
"ప్రధాని అభ్యర్థిగా ఎవరు నిలబడాలని అని నన్ను అడిగితే కచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ పేరే చెబుతాను. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ఢిల్లీలో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. ఉచితంగా తాగునీరు, విద్య, విద్యుత్, మహిళలకు బస్ సర్వీస్‌లు ఇలా ఎన్నో హామీలు నెరవేర్చుతున్నాం. అయినా...బడ్జెట్‌లో మిగులు కనిపిస్తోంది. మోదీ సర్కార్ వైఫల్యాలను పదేపదే అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ప్రస్తావించారు. మోదీ విద్యార్హతలనీ ప్రశ్నించారు"
- ప్రియాంక కక్కర్, ఆప్ జాతీయ ప్రతినిధి
మోదీకి విజన్ లేదు..
ప్రధాని మోదీకి ఓ విజన్ అంటూ లేదని, దేశంలో వస్తు తయారీ కూడా బాగా తగ్గిపోయిందని విమర్శించారు కక్కర్. అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అయితే ఇండియా మానుఫాక్చరింగ్ హబ్‌లా మారుతుందని అన్నారు.
"ప్రధాని నరేంద్ర మోదీకి ఓ ఎకనామిక్ విజన్ లేదు. దేశంలో వస్తు తయారీ తగ్గిపోతోంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అయితే మన దేశమే తయారీకి హబ్‌గా మారుతుంది. వ్యాపారాలు చేసుకునే వారికీ మంచి అవకాశాలొస్తాయి. పిల్లలకు విద్యావకాశాలు లభిస్తాయి. విదేశాల్లోని విద్యార్థులు ఇండియాకి వచ్చి చదువుకోడానికి ఆసక్తి చూపించే స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది"
- ప్రియాంక కక్కర్, ఆప్ జాతీయ ప్రతినిధి
Also Read: అమెజాన్ మేనేజర్ దారుణ హత్య, బైక్‌పై వెళ్తుండగా కాల్చి చంపిన దుండగులు