Tesla Tax Waivers: భారత్ మార్కెట్లలోని ప్రవేశించాలని చూస్తున్న ఈవీ కార్ల దిగ్గజ తయారీ సంస్థ టెస్లాకు ప్రత్యేకంగా ఎలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిగణించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గురువారం రాయిటర్స్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టెస్లా కోసం ఏదైనా సుంకం మినహాయించే ప్రణాళికలేవీ ప్రభుత్వం వద్ద లేవని తేల్చి చెప్పారు. భారత్ లో ఎలక్ట్రానిక్ కార్ల తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలనుకుంటున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు ఇలా భంగపాటు ఎదురైనట్లేనని సంబంధిత రంగ నిపుణులు అంటున్నారు. 


భారత్‌కు వస్తామన్న మస్క్‌కు భంగపాటు తప్పదా!


భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారని ఎలన్ మస్క్ ఇటీవలె మీడియా సమావేశంలో తెలిపారు. మోదీ జూన్ చివరి వారంలో అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో.. మోదీ, మస్క్ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మస్క్.. భారత్ లో ఫ్యాక్టరీ ప్రారంభించే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉంటుందన్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని గణనీయమైన పెట్టుబడులతో భారత్ కు వస్తామన్నారు. 


ఇప్పుడూ మినహాయింపునివ్వని సర్కారు!


కాగా, పన్ను మినహాయింపు విషయంపై టెస్లా అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపగా.. టెస్లా ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం. రెవెన్యూ శాఖ టెస్లాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని అనుకోవడం లేదని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. గతంలోనూ టెస్లా పన్ను మినహాయింపులు కోరింది. కేంద్ర సర్కారు అంగీకరించకపోవడంతో చైనాకు వెళ్లి అక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పింది. 


Also Read: PM Modi France Visit: ప్రెసిడెంట్ మెక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా బాస్టిల్ డే పరేడ్‌కు హాజరైన ప్రధాని మోదీ


ఏటా 5 లక్షల కార్‌ల తయారీ..! 
 
ఒకవేళ భారత్ కు టెస్లా వస్తే ఇక్కడ తయారయ్యే టెస్లా ఎలక్ట్రిక్ కార్‌ల ధర రూ.20 లక్షల వరకూ ఉంటుందని అంచనా. సంవత్సరానికి కనీసం 5 లక్షల కార్లు తయారు చేసేలా భారీ ప్లాన్‌తో రెడీ అవుతోంది టెస్లా కంపెనీ. మరో హైలైట్ ఏంటంటే..కేవలం ఇండియాలో విక్రయించేందుకే కాదు. మొత్తం ఇండో పసిఫిక్‌ రీజియన్‌కి ఇక్కడి నుంచి కార్లను సప్లై చేయాలని చూస్తోంది టెస్లా. అంటే.. ఈ మొత్తానికి ఇండియా హబ్‌ గా ఉండనుంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ టెస్లా నుంచి కానీ కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కేంద్రం, టెస్లా మధ్య చిన్న విభేదాలు తలెత్తాయి. ఇండియాకు కార్‌లు ఇంపోర్ట్ చేయడం కష్టం అవుతోందని టెస్లా అసహనం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం కూడా గట్టిగానే స్పందించింది. దిగుమతి పన్ను తగ్గించాలని టెస్లా అడిగినా కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. టెస్లా ఇండియాకు వచ్చి ఇక్కడే కార్‌లు తయారు చేస్తేనే డీల్‌కి ఒప్పుకుంటామని తేల్చి చెప్పింది భారత్. దీనిపై చాన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial